ఆ రాజు ‘కల’ చెదిరింది
Published Sat, Jan 7 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
(లక్కింశెట్టి శ్రీనివాసరావు)
కల చెదిరింది. క«థ మారింది. కన్నీరే ఇక మిగిలింది..ఒక కంట గోదావరి, మరో కంట పురుషోత్తపట్నం కలిసి ఒక్కసారే ఉప్పొంగాయా అన్నట్టుగా ఆ ‘రాజు’కు బాధ తన్నుకొచ్చింది. ఒకప్పుడు మహారాజులు ఏలిన పరగణాన్ని పాలిస్తున్న ఈ రాజుకు మంత్రి అవ్వాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం రెండున్నరేళ్లుగా ఎన్నో నిరీక్షణలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఆ రాజు తనకు రాజ్యాన్ని అప్పగించిన ‘చంద్ర’గిరి చక్రవర్తిపై ఈగ వాలితే చాలు కరవాలం ఝుళిపించడం అలవాటు చేసుకున్నారు. పనిలో పనిగా చంద్రగిరి చక్రవర్తి అనుంగుల ద్వారా రాయ‘బేరాలు’ కూడా నడిపారు. ఇంత చేసినా ఆ రాజు చిల్లర చేష్టలతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. రాజ్యాధికారం ఇక రెండేళ్లు మిగిలి ఉంది. మంత్రి అవ్వాలనే కోరిక ఎలా సాకారం చేసుకోవాలనే ఆలోచనలు చేస్తున్న సమయంలో తన రాజ్యంలో రైతులకు నీరందిస్తామనే ఎత్తిపోతల పథకం ఒకటి అందివచ్చింది. ఇంతకంటే చక్కని అవకాశం భవిష్యత్తులో మరొకటి దొరకదనే నిశ్ఛయానికి ఆ రాజు వచ్చేశారు. స్వయానా చంద్రగిరి చక్రవర్తి చేతుల మీదుగా భూమిపూజ చేసేందుకు సన్నాహాలు చేశారు. గోదావరి నీరు ఎత్తిపోసే పురుషోత్త రాజ్యంలో జరగాల్సిన కార్యక్రమాన్ని తన రాజకీయ చతురతతో తన రాజ్యంలోకి మార్చుకోగలిగారు.
సేనాధిపతుల ద్వారా పాఠశాలర«థాలను చంద్రగిరి చక్రవర్తి సభకు తరలించి జనాన్ని భారీగానే రప్పించాడు. రాజ్యంలో కరువు కాటకాలతో పట్టెడన్నం లేక రాజ్యాలు వదిలిపోయే జనం కోసం ఎంతో చేశానని నిండు సభలో ఆ రాజు చక్రవర్తి వద్ద ఘనంగా చెప్పుకున్నారు. అది అంత సత్యం కాదని ఆ చక్రవర్తికి తెలుసు. అయినా నిండు సభలో వాస్తవం చెప్పలేక అభినందించేశారు. ఇంకేముంది మంత్రి పదవి ఖాయమని మనసులో రాజు చాలా సంతోషంగా కనిపించారు. సామంతులుచే ‘మా రాజు’కు మంత్రి కావాలంటూ నినాదాలు చేయించడంతో చక్రవర్తి నోటి వెంట ‘మంత్రి అంటే మాటలా తమ్ముళ్లూ... చాలా మంది సామంతులు క్యూలో ఉన్నారనడంతో కిరీటం పడిపోయినంతపనైంది. ఎక్కడో 70, 80 మైళ్ల దూరంలో జరగాల్సిన చక్రవర్తి కార్యక్రమాన్ని తన రాజకీయ వ్యూహంతో అష్టకష్టాలు పడి తన రాజ్యంలో పెట్టుకున్నందుకు చివరకు ఏమి మిగిలిందని జుట్టు పీక్కున్నారు ఆ రాజు.
Advertisement
Advertisement