use less
-
ఆ రాజు ‘కల’ చెదిరింది
(లక్కింశెట్టి శ్రీనివాసరావు) కల చెదిరింది. క«థ మారింది. కన్నీరే ఇక మిగిలింది..ఒక కంట గోదావరి, మరో కంట పురుషోత్తపట్నం కలిసి ఒక్కసారే ఉప్పొంగాయా అన్నట్టుగా ఆ ‘రాజు’కు బాధ తన్నుకొచ్చింది. ఒకప్పుడు మహారాజులు ఏలిన పరగణాన్ని పాలిస్తున్న ఈ రాజుకు మంత్రి అవ్వాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం రెండున్నరేళ్లుగా ఎన్నో నిరీక్షణలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఆ రాజు తనకు రాజ్యాన్ని అప్పగించిన ‘చంద్ర’గిరి చక్రవర్తిపై ఈగ వాలితే చాలు కరవాలం ఝుళిపించడం అలవాటు చేసుకున్నారు. పనిలో పనిగా చంద్రగిరి చక్రవర్తి అనుంగుల ద్వారా రాయ‘బేరాలు’ కూడా నడిపారు. ఇంత చేసినా ఆ రాజు చిల్లర చేష్టలతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. రాజ్యాధికారం ఇక రెండేళ్లు మిగిలి ఉంది. మంత్రి అవ్వాలనే కోరిక ఎలా సాకారం చేసుకోవాలనే ఆలోచనలు చేస్తున్న సమయంలో తన రాజ్యంలో రైతులకు నీరందిస్తామనే ఎత్తిపోతల పథకం ఒకటి అందివచ్చింది. ఇంతకంటే చక్కని అవకాశం భవిష్యత్తులో మరొకటి దొరకదనే నిశ్ఛయానికి ఆ రాజు వచ్చేశారు. స్వయానా చంద్రగిరి చక్రవర్తి చేతుల మీదుగా భూమిపూజ చేసేందుకు సన్నాహాలు చేశారు. గోదావరి నీరు ఎత్తిపోసే పురుషోత్త రాజ్యంలో జరగాల్సిన కార్యక్రమాన్ని తన రాజకీయ చతురతతో తన రాజ్యంలోకి మార్చుకోగలిగారు. సేనాధిపతుల ద్వారా పాఠశాలర«థాలను చంద్రగిరి చక్రవర్తి సభకు తరలించి జనాన్ని భారీగానే రప్పించాడు. రాజ్యంలో కరువు కాటకాలతో పట్టెడన్నం లేక రాజ్యాలు వదిలిపోయే జనం కోసం ఎంతో చేశానని నిండు సభలో ఆ రాజు చక్రవర్తి వద్ద ఘనంగా చెప్పుకున్నారు. అది అంత సత్యం కాదని ఆ చక్రవర్తికి తెలుసు. అయినా నిండు సభలో వాస్తవం చెప్పలేక అభినందించేశారు. ఇంకేముంది మంత్రి పదవి ఖాయమని మనసులో రాజు చాలా సంతోషంగా కనిపించారు. సామంతులుచే ‘మా రాజు’కు మంత్రి కావాలంటూ నినాదాలు చేయించడంతో చక్రవర్తి నోటి వెంట ‘మంత్రి అంటే మాటలా తమ్ముళ్లూ... చాలా మంది సామంతులు క్యూలో ఉన్నారనడంతో కిరీటం పడిపోయినంతపనైంది. ఎక్కడో 70, 80 మైళ్ల దూరంలో జరగాల్సిన చక్రవర్తి కార్యక్రమాన్ని తన రాజకీయ వ్యూహంతో అష్టకష్టాలు పడి తన రాజ్యంలో పెట్టుకున్నందుకు చివరకు ఏమి మిగిలిందని జుట్టు పీక్కున్నారు ఆ రాజు. -
విశాఖ బీచ్ ఫెస్టివల్‌పై వ్యతిరేకత
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : హిందూ సంప్రదాయాలను కాలరాసే విశాఖ బీచ్ ఫెస్టివల్‌ని నిర్వహించరాదంటూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. అభివృద్ధి ముసుగులో సమాజ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టడం పాలకులకు సమంజసం కాదని యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు కె. రమణ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భారత దేశ సంస్కృతీసంప్రదాయాలకు విరుద్ధమని, యువతను తప్పుదారి పట్టించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదని నిర్వహిస్తే అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ఆర్. మహేష్, జి. శ్యామ్‌ప్రసాద్, రమణాచారి, సత్యనారాయణ, ఉదయ్‌కుమార్, దుర్గాప్రసాద్, దేవా, రమణ, అంజి, స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
‘పథకం’ ప్రకారమే..
పోలవరం ఉండగా.. పురుషోత్తపట్నం దండగ ఎవరి బాగుకోసమీ ‘ఎత్తిపోతలు’ రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం. టీడీపీ నేతలు చెబుతూ వస్తున్న మాటలివీ. మరి ఇంతలోనే పుష్కర ఎత్తిపోతల పథకం అవసరమేమిటనేది రైతుల సూటి ప్రశ్న. అంటే పోలవరం పూర్తి చేయాలనే చిత్తశుద్ధి సర్కార్‌కు లేకపోవడమైనా అయి ఉండాలి, లేదంటే ఎత్తిపోతల పేరుతో కోట్లు కొల్లగొట్టే వ్యూహమైనా ఉండాలని పలువురిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. హడావిడిగా భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోమవారం సాయంత్రం పొద్దుపోయాక ప్రతిపాదిత పురుషోత్తపట్నం ప్రాజెక్టును చూసి వెళ్లడంలోనే అవినీతి ‘పథకం’ బయటపడుతోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. . సాక్షిప్రతినిధి, కాకినాడ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో పోలవరం, పుష్కర ప్రాజెక్టులకు ప్రగతి బాట పట్టిస్తే చంద్రబాబు సర్కార్ ఎత్తిపోతల పథకాలతో ధన యజ్ఞనానికి ఆజ్యం పోస్తుందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇందిరాసాగర్ ప్రాజెక్టు(పోలవరం)ద్వారా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖకు తాగు, సాగు నీటి సరఫరా లక్ష్యంతో వైఎస్ తొలుత కాలువల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం ప్రాజెక్టు నిర్మాణం నత్తను తలపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించడంతో మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని నీరుగారుస్తూ ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకాల పేరుతో తమ్ముళ్లకు లబి ్థచేకూర్చేందుకు పెద్ద ఎత్తున నిధులు వృధా చేస్తోందని రైతు ప్రతినిధులు మండిపడుతున్నారు. . పట్టిసీమ తంత్రమే ఇక్కడా... పొరుగున పశ్చిమ గోదావరి జిల్లాలో కుడి కాలువపై పట్టిసీమకు కోట్లు కుమ్మరించిన చంద్రబాబు సర్కార్ జిల్లాలో అదే వ్యూహం పురుషోత్తపట్నం ఎత్తిపోతల చేపడుతోంది. పోలవరం ఎడమ కాల్వను అడ్డం పెట్టుకుని మన జిల్లాతోపాటు విశాఖ జిల్లాకు సాగు, తాగునీటి డ్రామాకు పథకం వేసిందనే విమర్శలున్నాయి. ఏలేరుకు గోదావరి జలాల అనుసంధానమని చెబుతూ సీతానగరం మండలం పురుషోత్తపట్నంకు రూ.1638 కోట్లతో పచ్చజెండా ఊపింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరికి ఎడమ వైపున 48.2 కిలో మీటరు వద్ద పంప్‌హౌస్ నిర్మించి 3500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు ప్రతిపాదించారు. పంప్‌హౌస్ నుంచి 10 కిలోమీటర్ల వరకు పైపులైన్ నిర్మించి అక్కడి పోలవరం కాల్వలోకి నీటిని మళ్లిస్తారట. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో పోలవరం కాల్వ 57వ కిలో మీటరు వద్ద రెగ్యులేటర్‌ను నిర్మించి ఏలేరు కాల్వలోకి నీటిని మళ్లిస్తామంటున్నారు. పంప్‌హౌస్, విద్యుత్ సబ్‌స్టేషన్, 10 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులకు రూ.1080 కోట్లు, ఏలేరు జలాశయంలో నీటి పంపింగ్‌కు రూ.558 కోట్లు ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు పూరై్తతే ఈ ఎత్తిపోతల పథకంపై వెచ్చిస్తున్న రూ.1080 కోట్లు వృధాయేనిని రైతులు ధ్వజమెత్తుతున్నారు. పోలవరం పూర్తిపై చిత్తశుద్ధి లేదెందుకో...? పోలవరం ఎడమ కాల్వ నిర్మాణం నేలకోట నుంచి విశాఖ వరకు. వైఎస్ హయాంలోనే రూ.1583.34 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికి 161.112 కిలోమీటర్ల మేర కాల్వ ఎర్త్ వర్కు, 117.114 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టారు. 452 నిర్మాణాలకు 102 పూర్తి చేశారు. 87 నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, 263 పూర్తి కావాలి. పోలవరం పూరై్తతే మన జిల్లాలో 2.50 లక్షలు, విశాఖలో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 270 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. ఈ ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రితోపాటు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ పదేపదే చెబుతున్నారు. సీఎం, మంత్రులే ఇలా చెబుతుంటే ఇన్ని వందల కోట్లు కుమ్మరించి ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం ఏమిటని విజ్ఞులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనుయాయులకు దోచిపెట్టడమే ధ్యేయంగా ఈ ఎత్తిపోతలకు నిధులను మళ్లిస్తున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. . ఎత్తిపోతలతోనూ ఒక పంటే దిక్కు... పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంతో సర్కార్ ఏలేరు రైతుల కడగండ్లు తీరుస్తామంటోంది. రెండో పంటకు ఈ ఎత్తిపోతల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉండదంటున్నారు. ఎప్పుడో తప్ప మూడొంతులు రెండో పంట సమయంలోSగోదావరిలో నీటి ఎద్దడి సహజం. ఏలేరు నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు. ప్రస్తుతం ఏలేరు ఆయకట్టులో ఖరీఫ్‌తోపాటు రబీకి కూడా నీటిని సరఫరా చేస్తున్నారు. ఏలేరు పరిధిలో సుమారు 53 వేల ఎకరాలు సాగవుతోంది. ఇందుకు ఐదు టీఎంసీలు అవసరం. ఎత్తిపోతల ద్వారా ఏలేరుకు నీటిని అందిస్తామని భరోసా ఇస్తున్న ప్రభుత్వం రెండో పంటలో నీటి ఇబ్బందులు ఎప్పుడూ తప్పడం లేదనే విషయాన్ని మరుగునపెడుతోంది. సహజంగా రబీలో గోదావరి నీటి మట్టం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. . పోలవరం పూర్తయ్యేలోగా పుష్కర ఉంది కదా పోలవరం పూర్తయ్యేలోగా పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నీటి ఎద్దడి సమయంలో ఏలేరు రైతులను ఆదుకోవచ్చు. పుష్కర ద్వారా లక్షా 87వేల ఎకరాలకు సాగునీరందించాలి. ప్రస్తుతం లక్షన్నర ఎకరాలకు సాగునీరందుతోంది. ఇంకా 37 వేల ఎకరాలకు సాగునీరందడం లేదు. అయినా పుష్కర నుంచి ఏలేరులో మొదటి పంటకు కూడా సాగునీరందించారు. ఈ ఖరీఫ్ సీజన్ ఏలేరు శివారు ఆయకట్టులో నీటి ఎద్దడిని అధిగమించేందుకు కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద ఏలేరు కాలువలోకి పుష్కర నీటిని మళ్లించారు. ఇప్పటికే ఆ విధంగా నీటిని అందజేశారు. రెండేళ్లలో పోలవరం పూర్తవుతుందని చెబుతున్న సీఎం, మంత్రులు ఈ రెండేళ్లలో ఇదే విధానంలో ఏలేరుకు నీటిని సరఫరా చేయవచ్చునంటున్నారు. దోచుకునేందుకే పురుషోత్తపట్నం ఎత్తిపోతలను సర్కార్ భుజాన వేసుకుందని రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. -
నాటి మాటలు..నీటి మూటలు
గత ఏడాది స్వాతంత్య్ర వేడుకల్లో యనమల ప్రగతి బాసలు ఏడాది దాటినా అమలుకు నోచని హామీలు వ్యవసాయంలో తిరోగమనం పట్టాలెక్కని ప్రాజెక్టులు పునాదులకూ నోచని గూడు వినువీధిలో రెపరెపలాడుతున్న మువ్వన్నెల పతాకం సాక్షిగా.. అమాత్యుడు ఇచ్చిన హామీలు గాలిలో కలిశాయి. ‘ప్రగతి దారుల్లో పయనిద్దాం’ అంటూ ఆయన చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. గత ఏడాది స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కాకినాడ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు.. జిల్లా అభివృద్ధిపై చేసిన బాసలు.. ఇప్పటికీ తీరని ఆశలుగానే మిగిలిపోయాయి. మళ్లీ నేడు స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కాలంలో ‘తూర్పు’.. ప్రగతి పట్టాలు తప్పి.. తిరోగమన దారుల్లో పయనిస్తున్న సత్యం అధికారుల లెక్కలు సాక్షిగా కళ్లెదుట సాక్షాత్కరిస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : గత ఏడాది కాకినాడ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి.. జిల్లా అభివృద్ధిపై సుమారు 45 నిమిషాలపాటు ప్రసంగించారు. ప్రగతి దారుల్లో పయనిద్దామని అన్నారు. కానీ, ఆయన ప్రసంగం ఒట్టి మాటలకే పరిమితమైంది. నాడు ఆయన ప్రసంగంలో పేర్కొన్న అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే అనేక రంగాల్లో జిల్లా తిరోగమనంలో పయనిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయంలో మూడో స్థానం వ్యవసాయ రంగంలో జిల్లాను మొదటి స్థానానికి తీసుకువస్తామని నాడు యనమల చెప్పారు. కానీ ప్రస్తుతం ఈ రంగంలో జిల్లా మూడో స్థానానికే పరిమితమైంది. మరోపక్క కోనసీమ రైతులు పంటవిరామం ప్రకటిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులు వ్యవసాయ రంగ అభివృద్ధికి పోలవరం సహా అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేస్తామని అప్పట్లో చెప్పారు. కానీ నేటికీ అనేక సాగునీటి ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. యనమల సొంత నియోజకవర్గం తునిలో తాండవ రిజర్వాయర్ అభివృద్ధికి కృషి చేసిన దాఖలాలు లేవు. 2003లో కుడి కాలువ పొడిగింపునకు శంకుస్థాపన చేసిన విషయాన్ని యనమల మరిచారని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్ కూడా ఆధునికీకరణకు నోచలేదు. నిర్వహణకు అవసరమైన నిధులు అందక చాగల్నాడు ఎత్తిపోతల పథకం లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. మోటార్ల మరమ్మతులకు రూ.6.50 కోట్లు కేటాయించినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. అంతంతమాత్రంగా పారిశ్రామిక ప్రగతి జిల్లా ప్రగతిలో పారిశ్రామిక రంగం చాలా కీలకమని, ఈ రంగంలో జిల్లాను మొదటి స్థానానికి తీసుకువెళ్తామని అప్పట్లో యనమల చెప్పారు. కానీ గతంలోలాగే ప్రస్తుతం ఈ రంగంలో జిల్లా రెండో స్థానానికి పరిమితమైంది. ఈ రంగంలో ఈ ఏడాది కొత్తగా సాధించిన ప్రగతి అంటూ ఏమీ లేదని అధికారిక లెక్కలనుబట్టి తెలుస్తోంది. కానరాని కొత్త పోర్టు సింగపూర్ వంటి తూర్పు దేశాలకు కాకినాడ తీరమే అతి దగ్గరని, కాకినాడలో ఉన్న రెండు పోర్టులకు అదనంగా మరో రెండు పోర్టులు వస్తున్నాయని నాడు యనమల చెప్పారు. కనీసం ఒక్క పోర్టు కూడా ఇంతవరకూ రాలేదు. దిగజారిన సేవారంగం సేవారంగాన్ని మరింత మెరుగు పరుస్తామని అప్పట్లో యనమల చెప్పారు. కానీ ఈ రంగంలో జిల్లా గత సంవత్సరం మూడో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది నాలుగో స్థానానికి దిగజారిపోయింది. ఒక్క ఇల్లూ రాలేదు పేదల గృహ నిర్మాణం కింద జిల్లాలో 9,103 ఇళ్లు నిర్మిస్తున్నామని అప్పట్లో యనమల చెప్పారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా జిల్లాకు 9,999 ఇళ్లు కేటాయించారు. కానీ ఈ ఏడాది కాలంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. డ్వాక్రా మహిళలకు మొండిచేయి డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి రాయితీగా రూ.200 కోట్లు, వడ్డీ రాయితీగా రూ.96 కోట్లు మంజూరు చేశామని ఆనాడు యనమల ప్రకటించారు. ఆ మాటలు నమ్మి ప్రతి సభ్యురాలూ తన ఖాతాలో రూ.10 వేలు జమ అవుతాయని భావించారు. కానీ ప్రభుత్వం మొదటి విడతగా ప్రతి సభ్యురాలికి రూ.3 వేలు మాత్రమే జమ చేసి చేతులు దులుపేసుకుంది. రూ.96 కోట్ల వడ్డీ రాయితీ ఇస్తామని యనమల చెప్పగా 2014–15కు 62,428 సంఘాలకు రూ.80.31 కోట్లు మాత్రమే జమ చేశారు. ‘స్మార్ట్’ కాలేదు జిల్లాలో 655 స్మార్ట్ వార్డులు ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. ఇప్పటివరకూ ఆయా వార్డులకు ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, అధికారులు, ఇతరుల భాగస్వామ్యంతో జిల్లాలో స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డులు అభివృద్ధి చేస్తామని చెప్పారు. 1433 గ్రామ, వార్డులకుగానూ 969 గ్రామ, వార్డుల దత్తత జరిగింది. ప్రస్తుతం వాటిల్లో అభివృద్ధి శూన్యంగానే కనిపిస్తోంది. విద్యారంగం పాఠశాలలకు 937 అదనపు గదులు మంజూరయ్యాయని నాడు యనమల చెప్పారు. ఈ ఏడాది కాలంలో వాటిలో 686 గదులు మాత్రమే పూర్తయ్యాయి. 99 గదులు స్లాబ్ లెవెల్లో నిలిచిపోయాయి. 151 గదుల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. బాలికల కోసం 765 టాయిలెట్లు నిర్మిస్తున్నామని యనమల అప్పట్లో ప్రకటించారు. తీరా చూస్తే 577 మాత్రమే పూర్తయ్యాయి. 188 టాయిలెట్స్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. యనమల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి సోమవారం నాటికి ఏడాది పూర్తవుతోంది. ఆయన చెప్పిన మాటల్లో ఏ ఒక్కటీ ఆచరణకు నోచలేదు. ఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గోనున్నారు. ఇప్పుడు ఆయన ఏ హామీలు ఇస్తారో చూడాలి.