‘పథకం’ ప్రకారమే..
-
పోలవరం ఉండగా.. పురుషోత్తపట్నం దండగ
-
ఎవరి బాగుకోసమీ ‘ఎత్తిపోతలు’
రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం. టీడీపీ నేతలు చెబుతూ వస్తున్న మాటలివీ. మరి ఇంతలోనే పుష్కర ఎత్తిపోతల పథకం అవసరమేమిటనేది రైతుల సూటి ప్రశ్న. అంటే పోలవరం పూర్తి చేయాలనే చిత్తశుద్ధి సర్కార్‌కు లేకపోవడమైనా అయి ఉండాలి, లేదంటే ఎత్తిపోతల పేరుతో కోట్లు కొల్లగొట్టే వ్యూహమైనా ఉండాలని పలువురిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. హడావిడిగా భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోమవారం సాయంత్రం పొద్దుపోయాక ప్రతిపాదిత పురుషోత్తపట్నం ప్రాజెక్టును చూసి వెళ్లడంలోనే అవినీతి ‘పథకం’ బయటపడుతోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
. సాక్షిప్రతినిధి, కాకినాడ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో పోలవరం, పుష్కర ప్రాజెక్టులకు ప్రగతి బాట పట్టిస్తే చంద్రబాబు సర్కార్ ఎత్తిపోతల పథకాలతో ధన యజ్ఞనానికి ఆజ్యం పోస్తుందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇందిరాసాగర్ ప్రాజెక్టు(పోలవరం)ద్వారా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖకు తాగు, సాగు నీటి సరఫరా లక్ష్యంతో వైఎస్ తొలుత కాలువల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం ప్రాజెక్టు నిర్మాణం నత్తను తలపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించడంతో మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని నీరుగారుస్తూ ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకాల పేరుతో తమ్ముళ్లకు లబి ్థచేకూర్చేందుకు పెద్ద ఎత్తున నిధులు వృధా చేస్తోందని రైతు ప్రతినిధులు మండిపడుతున్నారు.
.
పట్టిసీమ తంత్రమే ఇక్కడా...
పొరుగున పశ్చిమ గోదావరి జిల్లాలో కుడి కాలువపై పట్టిసీమకు కోట్లు కుమ్మరించిన చంద్రబాబు సర్కార్ జిల్లాలో అదే వ్యూహం పురుషోత్తపట్నం ఎత్తిపోతల చేపడుతోంది. పోలవరం ఎడమ కాల్వను అడ్డం పెట్టుకుని మన జిల్లాతోపాటు విశాఖ జిల్లాకు సాగు, తాగునీటి డ్రామాకు పథకం వేసిందనే విమర్శలున్నాయి. ఏలేరుకు గోదావరి జలాల అనుసంధానమని చెబుతూ సీతానగరం మండలం పురుషోత్తపట్నంకు రూ.1638 కోట్లతో పచ్చజెండా ఊపింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరికి ఎడమ వైపున 48.2 కిలో మీటరు వద్ద పంప్‌హౌస్ నిర్మించి 3500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు ప్రతిపాదించారు. పంప్‌హౌస్ నుంచి 10 కిలోమీటర్ల వరకు పైపులైన్ నిర్మించి అక్కడి పోలవరం కాల్వలోకి నీటిని మళ్లిస్తారట. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో పోలవరం కాల్వ 57వ కిలో మీటరు వద్ద రెగ్యులేటర్‌ను నిర్మించి ఏలేరు కాల్వలోకి నీటిని మళ్లిస్తామంటున్నారు. పంప్‌హౌస్, విద్యుత్ సబ్‌స్టేషన్, 10 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులకు రూ.1080 కోట్లు, ఏలేరు జలాశయంలో నీటి పంపింగ్‌కు రూ.558 కోట్లు ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు పూరై్తతే ఈ ఎత్తిపోతల పథకంపై వెచ్చిస్తున్న రూ.1080 కోట్లు వృధాయేనిని రైతులు ధ్వజమెత్తుతున్నారు.
పోలవరం పూర్తిపై చిత్తశుద్ధి లేదెందుకో...?
పోలవరం ఎడమ కాల్వ నిర్మాణం నేలకోట నుంచి విశాఖ వరకు. వైఎస్ హయాంలోనే రూ.1583.34 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికి 161.112 కిలోమీటర్ల మేర కాల్వ ఎర్త్ వర్కు, 117.114 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టారు. 452 నిర్మాణాలకు 102 పూర్తి చేశారు. 87 నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, 263 పూర్తి కావాలి. పోలవరం పూరై్తతే మన జిల్లాలో 2.50 లక్షలు, విశాఖలో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 270 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. ఈ ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రితోపాటు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ పదేపదే చెబుతున్నారు. సీఎం, మంత్రులే ఇలా చెబుతుంటే ఇన్ని వందల కోట్లు కుమ్మరించి ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం ఏమిటని విజ్ఞులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనుయాయులకు దోచిపెట్టడమే ధ్యేయంగా ఈ ఎత్తిపోతలకు నిధులను మళ్లిస్తున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
.
ఎత్తిపోతలతోనూ ఒక పంటే దిక్కు...
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంతో సర్కార్ ఏలేరు రైతుల కడగండ్లు తీరుస్తామంటోంది. రెండో పంటకు ఈ ఎత్తిపోతల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉండదంటున్నారు. ఎప్పుడో తప్ప మూడొంతులు రెండో పంట సమయంలోSగోదావరిలో నీటి ఎద్దడి సహజం. ఏలేరు నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు. ప్రస్తుతం ఏలేరు ఆయకట్టులో ఖరీఫ్‌తోపాటు రబీకి కూడా నీటిని సరఫరా చేస్తున్నారు. ఏలేరు పరిధిలో సుమారు 53 వేల ఎకరాలు సాగవుతోంది. ఇందుకు ఐదు టీఎంసీలు అవసరం. ఎత్తిపోతల ద్వారా ఏలేరుకు నీటిని అందిస్తామని భరోసా ఇస్తున్న ప్రభుత్వం రెండో పంటలో నీటి ఇబ్బందులు ఎప్పుడూ తప్పడం లేదనే విషయాన్ని మరుగునపెడుతోంది. సహజంగా రబీలో గోదావరి నీటి మట్టం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం.
.
పోలవరం పూర్తయ్యేలోగా పుష్కర ఉంది కదా
పోలవరం పూర్తయ్యేలోగా పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నీటి ఎద్దడి సమయంలో ఏలేరు రైతులను ఆదుకోవచ్చు. పుష్కర ద్వారా లక్షా 87వేల ఎకరాలకు సాగునీరందించాలి. ప్రస్తుతం లక్షన్నర ఎకరాలకు సాగునీరందుతోంది. ఇంకా 37 వేల ఎకరాలకు సాగునీరందడం లేదు. అయినా పుష్కర నుంచి ఏలేరులో మొదటి పంటకు కూడా సాగునీరందించారు. ఈ ఖరీఫ్ సీజన్ ఏలేరు శివారు ఆయకట్టులో నీటి ఎద్దడిని అధిగమించేందుకు కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద ఏలేరు కాలువలోకి పుష్కర నీటిని మళ్లించారు. ఇప్పటికే ఆ విధంగా నీటిని అందజేశారు. రెండేళ్లలో పోలవరం పూర్తవుతుందని చెబుతున్న సీఎం, మంత్రులు ఈ రెండేళ్లలో ఇదే విధానంలో ఏలేరుకు నీటిని సరఫరా చేయవచ్చునంటున్నారు. దోచుకునేందుకే పురుషోత్తపట్నం ఎత్తిపోతలను సర్కార్ భుజాన వేసుకుందని రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.