సాక్షి ప్రతినిధి, వరంగల్ : జనగామ పట్టణంలో ఆర్టీఏ యూనిట్ కార్యాలయం ప్రస్తుతం అద్దె భవనంలో ఉంది. ఈ ఆఫీసుకు శాశ్వత భవనం కావాలనే ప్రతిపాదనలను ముందుకు కదపడంతోపాటు కొత్త భవన నిర్మాణానికి మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన వంతు ప్రయత్నాలు చేశారు. రూ. 60 లక్షల విలువైన భవన నిర్మాణానికి సర్కారు నుంచి గ్రీన్‌సిగ్నల్ ఇప్పించారు. సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణం కావడంతో ప్రత్యేక చొరవ ప్రదర్శించినట్లు మంత్రికి గుర్తింపు వచ్చింది. భవనానికి అవసరమయ్యే స్థల సేకరణకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సిద్ధపడింది.
ఈ లోగా మంత్రి బంధువు ఒకరు చక్రం తిప్పారు. తమ రియల్ ఎస్టేట్ స్థలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇదో అనువైన.. అనుకూలమైన అవకాశంగా మలుచుకున్నారు. అక్కడున్న ప్లాట్ల ధరలకు రెక్కలొచ్చేలా అమాంతం డిమాండ్ పెంచుకునేందుకు సరికొత్త ఎత్తుగడ వేశారు. చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయ భవనానికి విరాళంగా ఇస్తే... పక్కనే తమకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లుతుందని పథకం పన్నారు. అనుకున్నదే తడవుగా తమకు అందుబాటులో ఉన్న దాదాపు 40 ఎకరాల్లో రెండెకరాల స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయానికి విరాళంగా స్వాధీనం చేశారు.
నిజానికి ఈ స్థలం జనగామ పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో పెంబర్తి గ్రామ పరిధిలో ఉంది. స్థానికులకు అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నప్పటికీ... మంత్రి గారి కనుసన్నల్లో విరాళంగా వచ్చిన భూములు కావడంతో రెవెన్యూ, ఆర్‌టీఏ అధికారులు కిమ్మని కూడా అనలేదు. దీంతో చకచకా ఏర్పాట్లు జరిగాయి. గత ఏడాది డిసెంబరు 20వ తేదీన మంత్రి పొన్నాల ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనుకున్నట్లుగానే తెరచాటు పథకం ఫలించింది. కొత్తగా ఆర్టీఏ ఆఫీసు అక్కడ నిర్మిస్తున్నారనే ప్రచారంతో అక్కడున్న రియల్ వ్యాపారం అంచనాలు దాటింది. మంత్రి బంధువు పంట పండింది. సెవెన్ హిల్స్ పద్మావతి డెవెలపర్స్ పేరిట మూడు వెంచర్లుగా తీర్చిదిద్దిన ఈ రియల్ ఎస్టేట్‌లో స్వయానా మంత్రి బంధువు ఒకరు డెరైక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ వెంచర్‌లో 150 గజాల ప్లాటును రూ. 2.36 లక్షలకు విక్రయిస్తున్నారు.
నిజానికీ ఆర్టీఏ ఆఫీసు ఊసు లేకముందు... ఈ గ్రామ పరిధిలో మార్కెట్ రేటు గజానికి కేవలం రూ. 40. వ్యాపార రీత్యా ఐదు రెట్లు గరిష్ఠంగా లెక్కలేసిన 150 గజాల ప్లాటు విలువ రూ. 30 వేలు దాటే ప్రసక్తి లేదు. రియల్ వెంచర్.. డెవెలప్‌మెంట్ మాటలు చెప్పినా.. ఒక్కో ప్లాటు రూ. 50 వేలు పలుకుతుంది. కానీ.. ఏకంగా నాలుగింతలకు పైగా రేట్లు పెంచి.. కోట్లాది రూపాయల విలువైన భూ దందాకు ద్వారాలు తెరిచారు.
ఇప్పటికీ అక్కడ ఆర్టీఏ ఆఫీసు నిర్మాణానికి సంబంధించి శిలాఫలకం తప్ప పునాదులు కూడా తవ్వలేదు. కానీ... మంత్రి బంధువుల రియల్ వ్యాపారం మాత్రం రోజురోజుకూ కోట్లకు పడగలెత్తుతోంది. భూరి విరాళమో... భూములను ఎరవేసి అడ్డగోలు సంపాదించడమెలాగో... జనగామ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెంబర్తి వద్ద వెలిసిన ఈ రియల్ వెంచర్ అందరి కళ్లకు కట్టిస్తోంది.
మంత్రి గారి బంధువుమాయ!
Published Mon, Aug 12 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement