నత్తనడకన సాగుతున్న ఓవర్‌హెడ్ ట్యాంకు పనులు
- పట్టించుకోని అధికారులు
- పనుల జాప్యంపై గ్రామస్తుల ఆగ్రహం
- వేగంగా చేయించాలని ప్రభుత్వానికి వినతి
కొండపాక: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి అధికారుల్లు, కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తున్నారు. భగీరథ నీటిని గడప గడపకు అందిస్తామన్న నేతల మాటలతో గ్రామస్తులు ఆశలు పెంచుకున్నారు. అయితే పనులు నత్తనడకనసాగుతుండటంతో నిరాశచెందుతున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా చూపిన శ్రద్ధ ఆ తర్వాత చూపడంలేదని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు.
మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొండపాక మండలానికి ప్రభుత్వం రూ.13 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 149 కి.మీ మేర అంతర్గత పైప్‌పనులు చేపట్టినట్టు మండల ఏఈ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. వీటితోపాటు గ్రామాల్లో నూతనంగా 20 రక్షిత నీటి ట్యాంకులు నిర్మించేందుకు కూడా నిధులు మంజూరు చేశారు. తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారి పక్కన, గజ్వేల్ మండలంలోని కోమటిబండ వద్ద భారీ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలు చేపట్టారు.
అంతర్గత పైప్‌లైన్ పనులు కూడా పూర్తిచేశారు. 20 ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో సిర్సనగండ్ల, లకుడారం మధిర సాకులగడ్డ, జప్తినాచారం మధిర రాజంపల్లి, సిర్సనగండ్ల మధిర ఓదన్‌చెర్వు, తిమ్మారెడ్డిపల్లి మధిర సార్లవాడల్లో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకులకు పైప్‌లైన్ కనెక‌్షన్ ఇవ్వకపోవడంతో నీటి సరఫరా జరగడంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా గిరాయిపల్లిలో నల్లా కనెక‌్షన్ పనులు గందరగోళంగా ఉన్నాయని, దీంతో అందరికీ సమానంగా నీటి సరఫరా జరిగే అవకాశం లేదని అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
అంతేకాకుండా సిర్సనగండ్లలో నాలుగు జోన్లకుగాను రెండు జోన్ల పైప్‌లైన్ కనెక‌్షన్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. ప్రధాని ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు హడావుడి చేశారని, అనంతరం గ్రామానికి రావడంలేదని పేర్కొంటున్నారు. ఇప్పటి కైనా అధికారులు చర్యలు తీసుకుని పనులు వేగంగా జరిగేలా చూడాలని కోరతున్నారు.
కనెక‌్షన్ ఇవ్వలేదు
రాజంపల్లి గ్రామంలో మంచి నీటి ట్యాంకును నిర్మించారు. కానీ ట్యాంకుకు చేరుకునే మెయిన్ పైప్‌లైన్ కనెక‌్షన్ ఇవ్వలేదు. దీంతో మిషన్ భగీరథ నీరు రావడంలేదు. ట్యాంకుకు కనెక‌్షన్ ఇచ్చి అందరికీ సమానంగా నీరు వచ్చేలా చూడాలి. - బొజ్జ కుమారస్వామి, రాజంపల్లి
నత్తనడకన ట్యాంకు నిర్మాణ పనులు
గ్రామంలో ఏసీ, బీసీ కాలనీ వాసులకు మిషన్ భగీరథ పథకంలో తాగునీరందించేందకు నిర్మిస్తున్న ట్యాంకు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులుగాని మిషన్ భగీరథ అధికారులుగాని పట్టించుకోవడంలేదు. దీంతో కాంట్రాక్టరు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాడు. - బైరెడ్డి గోవర్దన్‌రెడ్డి , సిర్సనగండ్ల
వారం రోజుల్లో అందరికీ నీరు అందేలా చూస్తాం
నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు సహకరించడంలేదు. దీంతో పనుల్లో జాప్యం నెలకొంది. పనుల వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. వారం రోజుల్లో అందరికీ గోదావరి జలాలు నల్లాల ద్వారా సరఫరా అయ్యేలా చూస్తాం. - ప్రవీణ్‌కుమార్, మిషన్ భగీరథ మండల ఏఈ