గొర్రెలకు ఏం తెలుస్తుంది గొర్రెల విలువ: కేసీఆర్
సిద్దిపేట: మూడేళ్లలో గొర్రెలపై తెలంగాణ యాదవులు, కురుమలు రూ.25వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ విషయం చాలామంది గొర్రెలకు (పరోక్షంగా విపక్షాలను ఉద్దేశిస్తూ) అర్థంకాదని విమర్శించారు. 2024నాటికి తెలంగాణ బడ్జెట్ 5కోట్లకు చేరుతుందని అన్నారు. మంగళవారం సిద్దిపేటలో పర్యటనలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. డోలు వాయించి కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈసందర్భంగా 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు కేసీఆర్ అందజేశారు. ఒక్కో లబ్దిదారుడికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో మొత్తం 7 లక్షల 18వేల మందికి కోటిన్నర గొర్రెలను పంపినీ చేస్తాం. మూడేళ్లలో వీటి ద్వారా 25 వేల కోట్ల ఆదాయం వస్తుంది. గొర్రెలకు వైద్యం కోసం 1962 టోల్ ఫ్రీ నెంబర్ కేటాయిస్తున్నాం. 2024నాటికి తెలంగాణ బడ్జెట్ 5లక్షల కోట్లకు చేరుతుంది. రైతులకు నీళ్లు, కరెంట్, పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది. ఎకరాకు రూ.4వేల ఎరువులు పెట్టుబడిగా ఇస్తాం. గ్రామీణ తెలంగాణ వికాసమే మా లక్ష్యం. కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతాం. విపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. వచ్చే ఏడాది జూన్‌కల్లా కొండపాకకు గోదావరి నీళ్లు వస్తాయి’ అని కేసీఆర్ అన్నారు.