గోరంట్లా.. దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలు
కడియం :
చంద్రబాబు చెప్పిన మోసపూరిత హామీల గాల్లో గెలిచిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి దమ్ముంటే తక్షణం తన పదవికి రాజీనామాచేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సవాల్ చేశారు. పార్టీ నాయకుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో జేగురుపాడులో ఆదివారం పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్య అతిథులుగా రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ జగన్‌ను నోటికొచ్చినట్టు విమర్శిస్తున్న గోరంట్ల తనకు పదవినిచ్చిన రూరల్ నియోజకవర్గం సమస్యలను పరిష్కరించడాన్ని మర్చిపోయారన్నారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి బంగారంపై అప్పులన్నీ తీర్చేస్తామని చెప్పుకొచ్చిన ఎంపీ మురళీమోహన్ ఏనాడైనా తన మాటను నిలబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. ఆయన అమరావతిలో రియల్‌ఎస్టేట్ వ్యాపారంపై పెట్టిన శ్రద్ధ తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించంపై పెడితే మంచిదన్నారు. వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న గడపగడపకూ కార్యక్రమంలో ప్రజలు ఇంటికో సమస్యను చెబుతున్నారన్నారు. రైతు, డ్వాక్రారుణమాఫీ అమలు జరగక, ఇంటిరుణాలు, ఇళ్లస్థలాలు, పెన్షన్లు మంజూరు కాక, రోడ్లు, డ్రైన్లు వంటి సమస్యలతో జనం సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు అంతా బాగుంటే ఇన్ని సమస్యలు ఎందుకున్నాయని రాజా ప్రశ్నించారు. ఎదుటి పార్టీ నాయకులను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి లాక్కుందామన్న ఆలోచనలే తప్ప ప్రజలు ఏమైపోతున్నారన్న ధ్యాస అధికార పార్టీకి లేకుండా పోయిందన్నారు. దోచుకోవడం అనే సింగిల్ పాయింట్ అజెండాతోనే చంద్రబాబు పనిచేస్తున్నాడన్నారు. జగన్‌ను అతిగా విమర్శిస్తే జనమే తిరగబడే పరిస్థితి ఉందన్నారు. టీడీపీ అబద్ధపు హామీల కారణంగానే రూరల్‌లో ఆకుల వీర్రాజు ఓటమిపాలయ్యారని రాజా చెప్పారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు జక్కంపూడి రాజాను యాదల సతీష్‌చంద్రస్టాలిన్, జేగురుపాడు గ్రామస్తులు గజమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జేగురుపాడు ఆడదాని రేవు వద్ద నుంచి యువకులు మోటారుసైకిల్ ర్యాలీ, పువ్వులతో నాయకులకు ఘన స్వాగతం పలికారు.