ఎమ్మెల్యే వివేకానంద్ భవనాలు సీజ్..
కుత్బుల్లాపూర్: హైకోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో ఎట్టకేలకు ఎమ్మెల్యే వివేకానంద్ అక్రమంగా నిర్మించిన భవనాలను జీహెచ్‌ఎంసీ నార్త్ జోన్ అధికారులు శనివారం సీజ్ చేశారు. భవన నిర్మాణంపై ఎమ్మెల్యే సమీప బంధువు ప్రతాప్ రెండేళ్ల క్రితం కోర్టును ఆశ్రయించగా, సదరు నిర్మాణాన్ని కూల్చి వేయాలని తీర్పునిచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వివేకానంద్ గడువు కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాడు.
దీంతో తిరిగి హైకోర్టులో వాదనల అనంతరం అక్రమంగా నిర్మించిన భవనంలో కొనసాగుతున్న కళాశాల, స్కూళ్లను ఖాళీ చేయాలని, నిర్మాణాలను కూల్చి వేసి ఫోటోలు అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో శనివారం ఉదయం నార్త్ జోన్ సిటీ ప్లానర్ సుజాత, ఏసీపీ సతీష్‌చంద్ర, డిప్యూటీ డిఈఓ ఉషారాణి తదితరులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య భవనాలను సీజ్ చేశారు. గత నెల రోజులుగా స్కూల్, కళాశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నా స్పందించకపోవడంతో సీజ్ చేసినట్లు ఉప కమిషనర్ మమత ‘సాక్షి’కి తెలిపారు.
ఎమ్మెల్యే వివేకానంద్ నిర్మించిన అక్రమ భవనం.. కళాశాలను సీజ్ చేసిన అధికారులు..