నయూమ్ కేసు సీబీఐకి అప్పగించాలి | mlc rajgopal reddy demand to nayim case transfer to cbi | Sakshi
Sakshi News home page

నయూమ్ కేసు సీబీఐకి అప్పగించాలి

Published Thu, Aug 18 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

mlc rajgopal reddy demand to nayim case transfer to cbi

ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి

యాదగిరిగుట్ట/వలిగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత రాజకీయ పార్టీల నాయకులు, పలు శాఖల అధికారుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.  20 ఏళ్లలో గ్యాంగ్‌స్టర్ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటపెట్టాలని, ఆయనకు సహకరించిన ప్రజాప్రతినిధులను, అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు.

తెలంగాణ, ఏపీలోనే కాక మరో ఐదు రాష్ట్రాల్లో ఆయన కార్యకలాపాలు విస్తరించాయని, ఎంతోమంది అమాయక ప్రజల ఆస్తులను లాగేసుకొని రోడ్డుపాలు చేశారన్నారు. జిల్లాలో 99 శాతం మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భువనగిరికి చెందిన కౌన్సిలర్లను నయీమ్‌తో బెదిరింపజేసి అధికారపార్టీలో చేర్పించుకున్నారన్నారు.

నయీమ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో లభించిన డైరీలో ఎంతోమంది రాజకీయ నాయకుల చరిత్రలు ఉన్నాయని, వాటిని సీఎం కేసీఆర్ బయట పెట్టాలన్నారు. సిట్ విచారణ లో వెల్లడైన విషయాలను గోప్యంగా ఉంచి అధికార పార్టీకి చెందిన నాయకులను కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నయూమ్ మొత్తం ఆస్తులను చూపెట్టకుండా రూ. 2.80 కోట్లు మాత్రమే చూపెట్టడం విడ్డూరమన్నారు. ఆ ఆస్తులను పేదలకు పంచాలని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement