Nayim encounter
-
‘నయీం’ ఘటనపై చిత్తశుద్ధి చాటుకోవాలి
గ్యాంగ్‌స్టర్ నయీం ఘటనపై ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ జరిపించి, చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఆయన నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో విలేకరులతో మాట్లాడారు. నయీంతో దగ్గరి సంబంధాలు నెరపిన ప్రజాప్రతినిధులతో వెంటనే రాజీనామా చేయించాలని కోరారు. గ్యాంగ్‌స్టర్ దందాపై సీబీఐతోగానీ, సుప్రీంకోర్టు జడ్జితోగానీ విచారణ చేయించాలని సూచించారు. రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని విమర్శించారు. మిషన్ కాకతీయ, భగీరథ పేర్లతో కోట్లాది రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం శ్రద్ధంతా వీటిపైనే ఉందని అన్నారు. వేలాది మంది ప్రజలు జ్వరాలతో మంచాన పడుతుండగా పట్టించుకోవటం లేదని అన్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచి జ్వర పీడితులను కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చెరుకు సుధాకర్ అన్నారు. -
నయీమ్ కేసులో 50కి చేరిన అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సిట్ పోలీసులు దాదాపు 50 మందిని అరెస్టు చేశారు. అయితే నయీమ్‌కు అత్యంత కీలకమైన అనుచరులు మరో ఐదుగురు ఉన్నట్లు సిట్ విచారణలో వెలుగు చూసింది. వీరి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ ఐదుగురు పట్టుబడితే నయీమ్‌కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల నుంచి కీలక వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ మేరకు సిట్ పోలీసులు ఏపీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల్లో గాలించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆ ఐదుగురు ఎక్కడ..: నయీమ్ ముఖ్య కోటరీ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన 50 మందిలో దాదాపుగా అందరూ నయీమ్ కుటుంబ సభ్యులు లేదా అనుచరులే ఉన్నారు. నయీమ్ తన ఆర్మీగా చెప్పుకునే ఐదుగురు వ్యక్తుల జాడ చిక్కడం లేదు. వీరిలో నయీమ్ కుడి భుజం శేషన్నతో పాటు రామన్న, ఖలీమ్, సురేందర్, జహంగీర్ అనే వ్యక్తుల కోసం సిట్ తీవ్రంగా గాలిస్తోంది. నయిమ్ను నేరుగా కలిసేది వీరు మాత్రమేనని, ఈ ఐదుగురూ తరచూ నయీమ్‌తో సమావేశమవుతుండేవారని పోలీసు దర్యాప్తులో వెలుగు చూసింది. మిగతా అనుచరులు ఫోన్లో మాట్లాడటమో, ఏదైన ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కలిసేవారని తెలిసింది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత చేపట్టిన దర్యాప్తులో రూ.వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు.. రూ.కోట్లలో నగదు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇంకా పెద్ద మొత్తంలో నగదు, భూ లావాదేవీల డాక్యుమెంట్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నయీమ్ కీలక అనుచరులను అదుపులోకి తీసుకుంటే పూర్తి వివరాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మావోయిస్టుల మాదిరిగా కొన్ని చోట్ల నయీమ్ డంపులు ఏర్పాటు చేసినట్లు అతడి కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే అవన్ని నయీమ్ ముఖ్య అనుచరుల కనుసన్నల్లోనే జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసింది. ‘సిట్’ అదుపులో నయీమ్ అనుచరుడు గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు సామ సంజీవరెడ్డిని సిట్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా పటాన్ చెరు సమీపంలోని విష్ణు లాడ్జిలో సంజీవరెడ్డి ఉన్నట్టు గుర్తించిన సిట్ పోలీసులు నేరుగా హోటళ్లోకి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన సంజీవరెడ్డి నయీమ్ ఆస్తులకు బినామీగా ఉన్నట్లు, మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో రైతుల వద్ద నుంచి 176 ఎకరాల భూమి బలవంతంగా లాక్కున్నట్లు ఆరోపణలు ఉన్నారుు. ఈ భూమిలోనే ఆయన ఒక ఫంక్షన్ హాల్ నిర్మించాడని సమాచారం. కాగా, నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన జంపాల సత్తయ్యకు నయీమ్గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయని సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
నయూమ్ కేసు సీబీఐకి అప్పగించాలి
ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి యాదగిరిగుట్ట/వలిగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత రాజకీయ పార్టీల నాయకులు, పలు శాఖల అధికారుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లలో గ్యాంగ్‌స్టర్ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటపెట్టాలని, ఆయనకు సహకరించిన ప్రజాప్రతినిధులను, అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణ, ఏపీలోనే కాక మరో ఐదు రాష్ట్రాల్లో ఆయన కార్యకలాపాలు విస్తరించాయని, ఎంతోమంది అమాయక ప్రజల ఆస్తులను లాగేసుకొని రోడ్డుపాలు చేశారన్నారు. జిల్లాలో 99 శాతం మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భువనగిరికి చెందిన కౌన్సిలర్లను నయీమ్‌తో బెదిరింపజేసి అధికారపార్టీలో చేర్పించుకున్నారన్నారు. నయీమ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో లభించిన డైరీలో ఎంతోమంది రాజకీయ నాయకుల చరిత్రలు ఉన్నాయని, వాటిని సీఎం కేసీఆర్ బయట పెట్టాలన్నారు. సిట్ విచారణ లో వెల్లడైన విషయాలను గోప్యంగా ఉంచి అధికార పార్టీకి చెందిన నాయకులను కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నయూమ్ మొత్తం ఆస్తులను చూపెట్టకుండా రూ. 2.80 కోట్లు మాత్రమే చూపెట్టడం విడ్డూరమన్నారు. ఆ ఆస్తులను పేదలకు పంచాలని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
కోట్ల కొద్దీ నగదు, ఆరు పిస్టళ్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/తుర్కయంజాల్: నయీమ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు నెక్నాంపూర్ పంచాయతీలోని అలకాపురి టౌన్షిప్లో ఉన్న నయీమ్ బావమరిది మహమ్మద్ అయూబ్ ఆలీ నివాసంలో, వనస్థలిపురంలో నయీ మ్ అనుచరుడిగా భావిస్తున్న శ్రీధర్‌గౌడ్ నివాసంలో సోదాలు చేశారు. అయూబ్ నివాసంలో రూ. 2.8 కోట్ల నగదు, మూడు పిస్టళ్లు, 1.93 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్‌గౌడ్ నివాసంలో రూ.38.5 లక్షల నగదు, 3 పిస్టల్లు, భూములు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది గంటల పాటు తనిఖీలు ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, శంషాబాద్ ఏసీపీ అనురాధ నేతృత్వంలోని పోలీసులు అలకాపూరి టౌన్షిప్ హెచ్ బ్లాక్ ఫ్లాట్ నంబర్ 105లో సోమవారం మధ్యాహ్నం 12 నుంచి దాదాపు రాత్రి 8.00 గంటల వరకు సోదాలు చేశారు. రూ.రెండు కోట్ల ఎనిమిది లక్షలు నగదు, మూడు పిస్టల్లు, ఒక డమ్మీ పిస్టల్, 169 బుల్లెట్లు, పది జిలెటిన్ స్టిక్స్, 1.93 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా వందలసంఖ్యలో భూములు, ఫ్లాట్ల డాక్యుమెంట్లు, వందల సంఖ్యలో సిమ్ కార్డులు లభ్యమయ్యాయి. ఇంట్లో దొరికిన డబ్బును లెక్కించేందుకు మిషిన్‌ను తెప్పించగా, అది సరిపోకపోవడంతో నార్సింగి ప్రాంతంలోని కిరాణా దుకాణాల నుంచి మరో రెండు మిషన్లను తెప్పించారు. ‘‘నయీమ్ బంధువులుగా చెబుతున్న ఫర్హా, ఆసియా (డ్రైవర్ భార్య) లతో పాటు ఇంట్లో ఉన్న మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నాం. వారిలో ఫర్హానా (11), రేష్మా (10), నజియా (17), సాహిరా (10), నబీ యా (12) అనే పిల్లలు ఉన్నారు. వారంతా ఎవరు, ఎక్కెడినుంచి వచ్చారనే వివరాలు తెలియాల్సి ఉంది. నయీమ్ ఇద్దరు కుమారులు దిల్లీ దిద్దీన్(11), అహదుద్దీన్ (14), కుమార్తె సఫా (8), నయీమ్ సోదరి కూమార్తె అబ్రన్లను కూడా పట్టుకున్నాం. ఈ పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తరలిస్తాం. మిగతావారిలో కేసుతో సంబంధం లేని వారిని విచారించాక వదిలిపెడతాం..’’ అని సైబరాబాద్ వెస్ట్ సీపీ నవీన్ చంద్ వివరించారు. శ్రీధర్‌గౌడ్ ఇంటిపై దాడులు హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామ పరిధిలోని తుల్జాభవానీకాలనీలో ఉన్న శ్రీధర్‌గౌడ్ ఇంటి పై సైబరాబాద్ ఈస్ట్ పోలీసులు దాడి చేశారు. రూ.38.5 లక్షల నగదు, మూడు పిస్టల్స్, పలు భూములు, ఆస్తుల డాక్యుమెంట్లు, ఒక కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్‌గౌడ్ భూదందాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. శ్రీధర్‌గౌడ్ నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన వాడని తెలుస్తోంది. నయీమ్ కుటుంబ సభ్యులకు డ్రైవర్‌గా పనిచేసేవాడని సమాచారం.