
నయీమ్ కేసులో 50కి చేరిన అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సిట్ పోలీసులు దాదాపు 50 మందిని అరెస్టు చేశారు. అయితే నయీమ్‌కు అత్యంత కీలకమైన అనుచరులు మరో ఐదుగురు ఉన్నట్లు సిట్ విచారణలో వెలుగు చూసింది. వీరి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ ఐదుగురు పట్టుబడితే నయీమ్‌కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల నుంచి కీలక వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ మేరకు సిట్ పోలీసులు ఏపీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల్లో గాలించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఆ ఐదుగురు ఎక్కడ..: నయీమ్ ముఖ్య కోటరీ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన 50 మందిలో దాదాపుగా అందరూ నయీమ్ కుటుంబ సభ్యులు లేదా అనుచరులే ఉన్నారు. నయీమ్ తన ఆర్మీగా చెప్పుకునే ఐదుగురు వ్యక్తుల జాడ చిక్కడం లేదు. వీరిలో నయీమ్ కుడి భుజం శేషన్నతో పాటు రామన్న, ఖలీమ్, సురేందర్, జహంగీర్ అనే వ్యక్తుల కోసం సిట్ తీవ్రంగా గాలిస్తోంది. నయిమ్‌ను నేరుగా కలిసేది వీరు మాత్రమేనని, ఈ ఐదుగురూ తరచూ నయీమ్‌తో సమావేశమవుతుండేవారని పోలీసు దర్యాప్తులో వెలుగు చూసింది. మిగతా అనుచరులు ఫోన్‌లో మాట్లాడటమో, ఏదైన ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కలిసేవారని తెలిసింది.
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత చేపట్టిన దర్యాప్తులో రూ.వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు.. రూ.కోట్లలో నగదు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇంకా పెద్ద మొత్తంలో నగదు, భూ లావాదేవీల డాక్యుమెంట్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నయీమ్ కీలక అనుచరులను అదుపులోకి తీసుకుంటే పూర్తి వివరాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మావోయిస్టుల మాదిరిగా కొన్ని చోట్ల నయీమ్ డంపులు ఏర్పాటు చేసినట్లు అతడి కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే అవన్ని నయీమ్ ముఖ్య అనుచరుల కనుసన్నల్లోనే జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసింది.
‘సిట్’ అదుపులో నయీమ్ అనుచరుడు
గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు సామ సంజీవరెడ్డిని సిట్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా పటాన్ చెరు సమీపంలోని విష్ణు లాడ్జిలో సంజీవరెడ్డి ఉన్నట్టు గుర్తించిన సిట్ పోలీసులు నేరుగా హోటళ్లోకి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన సంజీవరెడ్డి నయీమ్ ఆస్తులకు బినామీగా ఉన్నట్లు, మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో రైతుల వద్ద నుంచి 176 ఎకరాల భూమి బలవంతంగా లాక్కున్నట్లు ఆరోపణలు ఉన్నారుు. ఈ భూమిలోనే ఆయన ఒక ఫంక్షన్ హాల్ నిర్మించాడని సమాచారం. కాగా, నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన జంపాల సత్తయ్యకు నయీమ్‌గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.