గ్యాంగ్‌స్టర్ నయీం ఘటనపై ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ జరపాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు.
గ్యాంగ్‌స్టర్ నయీం ఘటనపై ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ జరిపించి, చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఆయన నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో విలేకరులతో మాట్లాడారు. నయీంతో దగ్గరి సంబంధాలు నెరపిన ప్రజాప్రతినిధులతో వెంటనే రాజీనామా చేయించాలని కోరారు. గ్యాంగ్‌స్టర్ దందాపై సీబీఐతోగానీ, సుప్రీంకోర్టు జడ్జితోగానీ విచారణ చేయించాలని సూచించారు. రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని విమర్శించారు. మిషన్ కాకతీయ, భగీరథ పేర్లతో కోట్లాది రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం శ్రద్ధంతా వీటిపైనే ఉందని అన్నారు. వేలాది మంది ప్రజలు జ్వరాలతో మంచాన పడుతుండగా పట్టించుకోవటం లేదని అన్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచి జ్వర పీడితులను కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చెరుకు సుధాకర్ అన్నారు.