నల్లగొండ టౌన్: ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారన్న కారణంతో డాక్టర్‌ను అరెస్ట్ చేసిన చరిత్ర ఇంతవరకు ఎక్కడా లేదని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం నల్లగొండలో ప్రజా సంఘాల నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఫీజులు ఎక్కువ వసూలు చేస్తే అందుకు సంబంధించి నోటీసులు ఇవ్వాలి. స్పందించని పక్షంలో చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎలాంటి నోటీసులు లేకుండా డీఎంహెచ్‌ఓను అడ్డం పెట్టుకుని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నా కుమారుడు డాక్టర్ సుహాస్‌ను అరెస్ట్ చేయడం, ఆస్పత్రిని సీజ్ చేయడం ఎంతవరకు సమంజసం’అని ప్రశ్నించారు. ఐసీయూలో పేషెంట్లు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ఆస్పత్రిని సీజ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రాజకీయంగా కుట్ర పన్ని సుహాస్‌ను అరెస్ట్ చేయించిందని ఆయన ఆరోపించారు. ఇది నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి సొంతంగా వచ్చిన ఆలోచన కాదని, పైనుంచి కింది వరకు రాజకీయ కుట్రతోనే జరిగిందని ఆరోపించారు. తానూ ఉద్యమంలో పనిచేశానని.. దేనికీ భయపడనన్నారు. ‘చావు నాకు బోనస్.. నా కొడుకుకు నేను పిరికి మందు తాపలేదు.. నా కొడుకు దగ్గర పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటా.. కానీ నువ్వెవరు మమ్మల్ని అనడానికి’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుహాస్‌పై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేసి ఆస్పత్రి సీజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో ప్రజా సంఘాలను కలుపుకొని ప్రభుత్వ తీరును ఎండగడతామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఆదివారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతున్న చెరుకు సుధాకర్
Comments
Please login to add a commentAdd a comment