మోహనరెడ్డి పీఆర్ కళాశాల పూర్వ విద్యార్థే
పద్మశ్రీ అందుకున్న నాలుగో పూర్వ విద్యార్థి
హర్షం వ్యక్తం చేసిన పూర్వ విద్యార్థి సంఘం
భానుగుడి (కాకినాడ సిటీ) : జిల్లాలో విద్యా చరిత్రకు పునాదిగా నిలిచిన పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల మరో ఘనకీర్తిని సొంతం చేసుకుంది.1880వ దశకం నుంచి నేటి వరకు కొన్ని లక్షల మంది విద్యార్థుల ఉన్నతికి ఈ కళాశాల కల్పవల్లిగా నిలిచిన విషయం తెలిసిందే. వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విశేష సేవలందించి, భారత కీర్తిని ఆ రంగాల్లో ప్రపంచ యవనికపై సగర్వంగా నిలిపినందుకు పద్మశ్రీ అవార్డు అందుకున్న డాక్టర్ బీవీఆర్ మోహనరెడ్డి (సైయెంట్ వ్యవస్థాపకులు) పీఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థి. ఇప్పటికి ఈ కళాశాలకు చెందిన నలుగురు పూర్వ విద్యార్థులు పద్మ పురస్కారాలు అందుకోవడం కళాశాల కీర్తిని మరింత పెంచింది.
ఇప్పటికి నలుగురు..
1935లో పీఆర్ ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మామిడికుదురుకు చెందిన ప్రముఖ కవి భోయిభీమన్న (1973 పద్మశ్రీ,, 2001 పద్మభూషణ్),1950లో బోటనీ, జువాలజీలతో డిగ్రీ చదివిన పశ్చిమ గోదావరి చిట్టవరానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త మంగిన వెంకటేశ్వరరావు (1999 పద్మశ్రీ), 1940లో ఈ కళాశాలలో డిగ్రీ చదివిన ద్రాక్షారామకు చెందిన వీణా వాయిద్య, సంగీత కళాకారుడు ఈమని శంకరశాస్త్రి (1974 పద్మశ్రీ)లతో పాటు ప్రస్తుత పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహనరెడ్డి నలుగో వ్యక్తి కావడం విశేషం.
ఉన్నత విద్య ఇక్కడే..
బీవీఆర్ మోహనరెడ్డి తండ్రి ఏపీఎస్పీలో ఉద్యోగ దీత్యా కాకినాడకు వచ్చారు. దీంతో మోహనరెడ్డి తన ఉన్నత విద్య అంతటినీ ఇక్కడే పూర్తిచేశారు. కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీని పూర్తిచేసి,1965–66లో పీఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివారు. 1966 నుంచి 70 వరకు జేఎన్‌టీయూకేలో ఇంజనీరింగ్Š చేశారు. ఆ తర్వాత ఐఐటీని ఖరగ్‌పూర్‌లో పూర్తిచేశారు. ఈ క్రమంలో మోహనరెడ్డి ఇక్కడ అనేక మంది స్నేహితులను సంపాదించుకున్నారు. తాను చదువుకున్న పీఆర్ కళాశాలలో ఆయన రూ.22 లక్షలతో మినీ ఆడిటోరియాన్ని నిర్మించారు. గతేడాది కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే లో విద్యార్థులకు ఆయన స్వయంగా డిగ్రీ పట్టాలను అందించి ప్రగతి పథంలో నడవాలని పిలుపునిచ్చారు. బీవీఆర్ మోహనరెడ్డికి పద్మశ్రీ పురస్కారం దక్కడం పట్ల పీఆర్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం హర్షం వ్యక్తం చేసింది.