కొత్త పంటలతో అధిక దిగుబడులు
పి.కోటకొండ(దేవనకొండ) : కొత్త పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ రైతులకు పిలుపునిచ్చారు. దేవనకొండ మండలం పి. కోటకొండ సమీప పొలాల్లో సాగు చేసిన గర్కిన్ దోస, అల్లోమిన్ పంటలను ఆయన మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట దిగుబడులు, ఇతర వివరాలు తెలుసుకున్నారు. అల్లోమిన్ మిరప పంటను జిల్లాలో ఎక్కడా సాగు చేయడంలేదని, పి.కోటకొండ గ్రామంలో సాగుచేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. కొత్తకొత్త పంటలను సాగుచేసి పలువురు రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పంటలకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ తిరుమలవాణి, వీఆర్వో సీతారామిరెడ్డి, ఉద్యానవనశాఖ సిబ్బంది ఉన్నారు.