‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ.. | Robotic excavator builds a giant stone wall | Sakshi
Sakshi News home page

Robotic excavator: ‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ..

Published Thu, Nov 23 2023 11:32 AM | Last Updated on Thu, Nov 23 2023 1:13 PM

Robotic excavator builds a giant stone wall - Sakshi

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని అంటుంటారు. పూర్వకాలంలో ఈ రెండు పనులూ ఎంతో శ్రమ, ఖర్చుతో కూడినవి కావడంతో అలా అనేవారు. అయితే ఇప్పుడు ఈ రెండు పనులు రోబోలు అత్యంత సులభంగా చేసేస్తున్నాయి.  పాశ్చాత్య దేశాల్లో కొందరు.. రోబోలను వివాహం చేసుకుంటున్నారనే వార్తలు వింటున్నాం. కొత్తగా ఇప్పుడు ఇళ్లను రోబోలే స్వయంగా కట్టేస్తున్నాయి. అది కూడా అత్యంత ధృఢంగా.. పురాతన పద్ధతిలో.. ఆధునికత మేళవిస్తూ.. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఇంటి నిర్మాణంలో బండరాళ్లను ఒక పద్ధతిలో పేర్చడం  అనేది ఎంతో శ్రమతో కూడిన పని. ఇందుకోసం  శారీరకంగానే కాదు..మానసికంగానూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రోబో ఈ పనిని చిటికెలో చేసేస్తోంది. 

ఇంటికి అవసరమయ్యే గోడ నిర్మాణాలను చేపట్టే ఈ రోబోట్ పేరు ‘హీప్‌’(హెచీఈఏపీ) ఇదొక హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్‌. ఇది వాకింగ్ ఎక్స్‌కవేటర్ కూడా. దీనిని ఈటీహెచ్‌ జ్యూరిచ్ పరిశోధనా సంస్థ బృందం తయారుచేసింది. ఈ రోబోలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్, కంట్రోల్ మాడ్యూల్, తవ్వకాల ఆర్మ్‌పై లిడార్‌ సెన్సార్‌లు ఉన్నాయి. 

ఈ రోబో తాను చేపడుతున్న తాజా ప్రాజెక్ట్ కోసం నిర్మాణ స్థలాన్ని స్కాన్ చేసి, దాని త్రీడీ మ్యాప్‌ను రూపొందించడం ద్వారా పనిని ప్రారంభించింది. తరువాత ఆ సైట్‌లో డంప్ చేసిన బండరాళ్లను గోడలో ఎక్కడ ఉంచాలనేది రికార్డ్ చేసింది. అనంతరం ‘హీప్‌’ ప్రతి బండరాయిని భూమి నుండి పైకి లేపింది. ఇందుకోసం దాని బరువు, గురుత్వాకర్షణ కేంద్రాన్ని అంచనా వేయడానికి, దాని ప్రత్యేక ఆకారాన్ని రికార్డ్ చేయడానికి సాంకేతికతను ఉపయోగించింది.

ఒక అల్గారిథమ్ రూపకల్పన అనంతరం 20 అడుగుల ఎత్తు, 65 మీటర్ల పొడవైన రాతి గోడను నిర్మించడానికి ప్రతి బండరాయిని అది చక్కగా ఇమిడిపోయే ప్లేస్‌లో అమర్చింది. ఒక్కో బిల్డింగ్ సెషన్‌కు దాదాపు 20 నుండి 30 బండరాళ్లను వాటి స్థానాల్లో ఉంచింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ నూతన రోబో వ్యవస్థ.. నిర్మాణ రంగాన్ని మరింత సులభతరం చేస్తుంది. బండరాళ్లను తీసుకురావడం మొదలుకొని, వాటితో సరైన గోడను నిర్మించేవరకూ ‘హీప్‌’ ఎంతగానో  ఉపయోగపడుతుంది. ఈ రోబో అధ్యయనానికి సంబంధించిన పత్రం ఇటీవల సైన్స్ రోబోటిక్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈటీహెచ్‌ జ్యూరిచ్ అందించిన ఈ వీడియోలో ‘హీప్‌’ గోడ నిర్మాణాన్ని చూడవచ్చు.
ఇది కూడా చదవండి: కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement