వజ్రాల పేరిట ఘరానా మోసం
-
-
కళ్లలో కారం కొట్టి రూ.15 లక్షలు చోరీ
-
బాధితులు కృష్ణాజిల్లా వాసులు
-
నిందితుల్లో ఒకరు అల్లవరం వాసిగా గుర్తింపు
మామిడికుదురు :
లక్షల విలువ చేసే వజ్రాలు అతి తక్కువ మొత్తానికి మీ సొంతం అవుతాయంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లల్లో కారం కొట్టి రూ.15 లక్షలతో ఉడాయించిన సంఘటన మండల పరిధిలోని కొమరాడ గ్రామంలో జరిగింది. బాధితుడు విజయవాడకు చెందిన మేదరమట్ల శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేదరమట్ల శ్రీధర్ తన సోదరుడు గంటా రాజేష్, స్నేహితుడు ఎలీషాలకు పది రోజుల క్రితం కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన పాస్టర్ ఎంఎస్ రాజుతో పరిచయం ఏర్పడింది. అతను అమలాపురానికి చెందిన తన స్నేహితుని వద్ద రూ.40 లక్షల విలువ చేసే నాలుగు వజ్రాలు ఉన్నాయని, అవి కేవలం రూ.15 లక్షలకే మన వశమవుతాయని నమ్మించాడు. దీంతో అన్నదమ్ములిద్దరూ స్నేహితుడు రాజును ముందువెళ్లి వజ్రాలు చూడమని, వెనుక తాము వస్తామని బుధవారం రాత్రి అమలాపురం పంపారు. వజ్రాలు తాను చూశానని, డబ్బు తీసుకుని రావడమే తరువాయన్న రాజు సూచన మేరకు గురువారం విజయవాడ నుంచి వారు ముగ్గురూ కారులో అమలాపురం వచ్చారు. ఇక్కడ జనం రద్దీ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ డీల్ అంత కరెక్టు కాదు పాశర్లపూడి రేవులో మా గెస్ట్ హౌస్ ఉంది అక్కడ డబ్బు తీసుకుని వజ్రాలు ఇస్తామని చెప్పడంతో అక్కడి నుంచి బాధితులు మధ్యాహ్నం పాశర్లపూడి రేవు దగ్గరకు వచ్చారు. తీరా ఇక్కడ వచ్చాకా ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని మామిడికుదురు వెళ్దామని చెప్పడంతో ఇక్కడకు వచ్చారు. ఇక్కడకు సమీపంలోని కొమరాడలో వజ్రాలు ఇస్తామని చెప్పి అక్కడకు వెళ్లాకా కారు వెనుక మోటార్ సైకిళ్లపై వచ్చిన పాస్టర్ రాజుతో సహా ముగ్గురు వ్యక్తులు గంటా రాజేష్‌ను ఎక్కించుకుని మళ్లీ వచ్చి మిమ్మల్ని ఇద్దరినీ తీసుకు వెళ్తామని చెప్పి వెళ్లారు. పొలాల్లో రాజేష్‌తో పాటు పాస్టర్ రాజు కళ్లలో కారం కొట్టిన నిందితులు రూ.15 లక్షలు తీసుకుని పరారయ్యారు. జరిగిన విషయాన్ని బాధితులు కారులో వేచి ఉన్న మేదరమట్ల శ్రీధర్, ఎలీషాలకు చెప్పడంతో వారు లబోదిబోమన్నారు. నగరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై జి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు అల్లవరానికి చెందిన పి.రాజేష్‌గా గుర్తించి కేసు దర్యాప్తు చేపట్టారు.