జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న త్రివేణి
♦ రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిండు గర్భిణి
♦ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వైనం
♦ కన్నతల్లి కోసం ఓ పసి హృదయం ఆక్రోశం
గుంటూరు ఈస్ట్ : అటు ఆస్పత్రిలో గాయపడి చికిత్స పొందుతున్న అమ్మ... ఇటు అమ్మను చూడాలని ఓ పసి హృదయం ఆరాటం. విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరూ ఎడబాటుకు గురయ్యారు. పుట్టబోయే బిడ్డపై గంపెడంత ఆశతో ఆసుపత్రికి బయలుదేరిన నిండు గర్భిణిని విధి వెక్కిరించింది. అయితే, విషాద సంఘటనలోనూ ఆమె ఒడిలో ఉన్న ఐదు సంవత్సరాల బాలుడు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా బయట పడ్డాడు. అయితే, కడుపులోని బిడ్డ కూడా దక్కకపోవడంంతో తల్లడిల్లుతోంది ఆ మాతృ హృదయం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన నెలలు నిండిన గర్భిణి జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. వివరాలు...విజయవాడలో నివసించే మిరప రాజశేఖర్ రాడ్ బెండింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు.
అతని భార్య త్రివేణి మొదట ఒక బాబుకు జన్మనిచ్చింది. రెండవ కాన్పు కోసం మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలోని పుట్టింటికి కొన్ని నెలల కిందట వచ్చింది. తండ్రి గతంలో మృతి చెందడంలో తల్లి సీతారావమ్మను వెంటబెట్టుకుని బస్సులో వెళుతూ జీజీహెచ్‌లో ప్రతినెలా పరీక్షలు చేయించుకుంటున్నది. సెప్టెంబర్‌తో 9 నెలలు నిండాయి. ప్రసవం తేదీ తెలుసుకునేందుకు గురువారం బయలుదేరేందుకు నిర్ణయించుకుంది. అయితే, తల్లి సీతారావమ్మకు జ్వరంగా ఉండటంతో తమ్ముడు రవితో ద్విచక్రవాహనంపై కుమారుడు శ్రీరామ్ ను తీసుకుని జీజీహెచ్‌కు బయలుదేరింది. నల్లపాడు రోడ్డులోని ఎన్‌జీవో కాలనీ సమీపానికి చేరుకోగా నీళ్ల ట్యాంకరే వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురు కింద పడ్డారు. లారీముందు చక్రం త్రివేణి ఎడమ కాలు, ఎడమ చేయి మీదకు ఎక్కింది. తీవ్రంగా గాయపడిన ఆమెను 108 అంబులెన్సులో జీజీహెచ్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యులు ఆమెకు చికిత్స చేశారు. అయితే, ఈ ప్రమాదంలో వాహనంపై ప్రయాణం చేస్తున్న రవి, శ్రీరామ్‌లు ఎటువంటి దెబ్బలు లేకుండా బయట పడ్డారు. నీళ్ల ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడు. నెలల నిండిన త్రివేణికి ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి మగ బిడ్డను తీశారు. అయితే, కన్నతల్లికి కడుపుకోత మిగులుస్తూ మృతి చెందడం విషాదం.