తల్లిపాలు బిడ్డకు ఔషధం
-
బాలల పరిరక్షణ అందరి బాధ్యత
-
అవగాహన సదస్సులో ఆర్టీసీ చైర్మన్, మేయర్
కోల్‌సిటీ : తల్లి పాలు బిడ్డకు ఔషధం లాంటివని, పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ఇవ్వాలని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు. తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని సీఆర్‌సీ భవనంలో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, సమగ్ర బాలల పరిరక్షణ పథకం(ఐసీపీఎస్)పై సోమవారం అవగాహన కల్పించారు. ప్రసవించిన గంటలోనే బిడ్డకు ముర్రుపాలు పాట్టిస్తే, రోగ నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు బిడ్డకు రక్షణగా నిలుస్తాయన్నారు. మూఢనమ్మకాలతో పిల్లలకు ముర్రుపాలు పట్టకుండా నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ చేతుల మీదుగా గర్భిణులకు శ్రీమంతం చేశారు. సమగ్ర బాలల పరిరక్షణ పథకం(ఐసీపీఎస్)పై బల్దియా కార్పొరేటర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఐసీపీఎస్ పీడీ రాధమ్మ, డీసీపీవో పర్వీన్ అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు బాల, బాలికల హక్కుల రక్షణ, సంరక్షణ కోసం బాలల న్యాయ చట్టం–2000 ప్రకారం కేంద్ర, రాష్ట్రాలతో సంయుక్తంగా దేశమంతటా సమగ్ర బాలల పరిరక్షణ పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. ఈ పథకం పరిధిలోకి వచ్చే బాలలు, వారి రక్షణ కోసం కేటాయించిన ప్రాథమిక సూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ పథకం విజయవంతంగా నిర్వహించడానికి 50 డివిజన్లలో 50 కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. బాల, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఈ కమిటీలు పరిష్కరించడానికి దోహదపడుతాయని వెల్లడిచారు. కార్యక్రమాలలో డెప్యూటీ మేయర్ సాగంటి శంకర్, రామగుండం జెడ్పీటీసీ, స్త్రీ శిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కందుల సంధ్యారాణి, జిల్లా ప్రణాళిక సంఘం సభ్యురాలు సోమారపు లావణ్య, కార్పొరేటర్లు ముప్పిడి సత్యప్రసాద్, కుంట సాయి, దాసరి ఉమాదేవి, జాలి రాజమణి, బక్కి రాజకుమారి, తోట అనసూర్య, నాయిని భాగ్యలక్ష్మి, సింహాచలం మాధవి, దాసరి సుందరమ్మ, బొమ్మక శైలజ, దాసరి సావిత్రి, తస్లీమాబాను, సీడీపీవో స్వరూప, సోషల్ వర్కర్ కవితాదేవి తదితరులు పాల్గొన్నారు.