
కవలలను బావిలో పడేసి తల్లి ఆత్మహత్యాయత్నం
ఇద్దరు పిల్లలు మృతి, తల్లికి గాయాలు
కామారెడ్డి: ప్రేమించి పెళ్లాడిన భర్త మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన ఆ ఇల్లాలు ఇద్దరు కవలలను బావిలో పడేసి తనూ దూకింది. పిల్లలిద్దరూ చనిపోగా, తల్లి గాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో ఆదివారం జరిగింది. గర్గుల్‌కు చెందిన రజిత(25), బొంబోతుల మహేశ్ గౌడ్ ఐదేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిది నెలల వయస్సున్న కవలలు కీర్తన, కౌశిక్ ఉన్నారు.
మహేశ్‌గౌడ్ కామారెడ్డిలోని మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన రజిత ఆదివారం ఉదయం ఇంట్లోని చేదబావిలో కవల పిల్లలను పడేసి, తానూ దూకింది. చుట్టుపక్కలవారు వచ్చి వారిని బయటకు తీయగా చిన్నారులు అప్పటికే శవాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రజితను ఆస్పత్రికి తరలించారు.