ఎడపల్లి : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో ఆదివారం ఓ బాలుడిని విక్రయించడానికి వచ్చిన తల్లిని గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటకు చెందిన శైలజకు నిజామాబాద్ పట్టణానికి చెందిన పోశెట్టితో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కాగా శైలజతో భర్త పోశెట్టి విడాకులు పొంది నాలుగేళ్లు అవుతోంది. అప్పటి నుంచి శైలజ తన తల్లిదండ్రులు రాజేందర్-రేణుకల వద్ద నిజామాబాద్ పట్టణంలోని గాజుల్‌పేటలో ఉంటుంది.
ఆదివారం శైలజ తన రెండున్నరేళ్ల కుమారుడు బాలయ్యను జానకంపేట గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయించాలని గ్రామంలో తిరుగుతోంది. అనుమానం వచ్చిన గ్రామస్తులు ఆమెను నిలదీయగా అసలు విషయం బయట పడింది. స్థానికులు గ్రామ సర్పంచ్ బండారి దశరథ్‌కు సమాచారం అందించగా.. ఆయన ఐసీడీఎస్ జిల్లా ఇన్‌చార్జి పీడీకి, మండల ఐసీడీఎస్ సూపర్‌వైజర్లకు సమాచారం అందించారు. ఐసీడీఎస్ అధికారులు స్పందించకపోవడంతో.. చివరకు గ్రామంలో ఉన్న అంగన్‌వాడి కార్యకర్తలకు పసిబాలున్ని అప్పగించారు. కాగా, ఐసీడీఎస్ అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని సర్పంచ్ తెలిపారు.