నేను తెలుగుదేశానికి భక్తుడిని
ఏ ఆశా లేనివాడిని.. చచ్చిన నాడు పార్టీ జెండా కప్పితే చాలు: మోత్కుపల్లి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నేను తెలుగుదేశానికి భక్తుడిని. ఒకప్పు డు అర్ధ రూపాయి లేక అవస్థలు పడ్డ నేను...ఏకంగా 30 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశా. అన్న ఎన్టీఆర్ చలువ వల్ల రాజకీయాల్లో ఎదిగా. ఎన్టీఆర్ శిష్యుడిగా, చంద్రబాబు అనుచరుడిగా ఇంకా ప్రజలకు సేవలు అం దించాలనుకుంటున్నా’ అని మాజీ మంత్రి, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ‘నాకిప్పుడు ఏ ఆశా లేదు. చచ్చిన నాడు నా శవంపై పార్టీ జెండా కప్పితే చాలు’ అని ఉద్వేగంతో అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో రెండో రోజైన శనివారం ఆయన ఉద్వేగం, ఆవేదనాభరిత స్వరంతో ప్రసంగించారు. పార్టీ పరంగా తనకు సరైన ప్రాధాన్యం కల్పించాలని పార్టీనేతకు విజ్ఞప్తి చేశారు.
తన 27వ ఏట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్ సేవలను మోత్కుపల్లి కొనియాడారు. తెలంగాణలో దొరతనాలకు స్వస్తి చెప్పి, బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు. తాను దళితుడినైనా ఎన్టీఆర్ రాజకీయంగా ప్రోత్సహిం చారనీ, ఆయన రుణం తీర్చుకోలేని దన్నారు. పలు సందర్భాల్లో చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నో ఆరోపణలు చేశారనీ, అన్నింటినీ తిప్పికొట్టామన్నారు. తెలుగుదేశంలో కొనసాగుతున్న తనను టీఆర్‌ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా పలుమార్లు తిట్టడమే కాకుండా చంపుతామని బెదిరించారన్నారు.
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై పోరాటం చేశామన్నారు. కేసీఆర్ ఒకప్పుడు తనకు మంచి మిత్రుడే అయినా పార్టీ విధానాలు, ఆశయాల విషయంలో ఇద్దరి మధ్యా వ్యత్యాసముందన్నారు. చంద్రబాబు దయ, ఆశీర్వచనం ఉంటే తెలంగాణ ప్రజలకు సేవ లు కొనసాగిస్తానన్నారు. ఈ సందర్భంగా త్వరగా ప్రసంగాన్ని ముగించాలంటూ సైగలు చేసిన పయ్యావుల కేశవ్‌పై మోత్కుపల్లి అసహనం వ్యక్తం చేశారు.