మోత్కుపల్లి గైర్హాజరు.. బిల్యా అలక
Published Wed, Nov 23 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
సాక్షి, నల్లగొండ : తెలుగుదేశం పార్టీ గ్రూపు తగాదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోత్కుపల్లి, ఉమా మాధవరెడ్డి వర్గాలుగా చీలిపోయి వ్యవహరించిన తెలు గు తమ్ముళ్ల మధ్య వైరం జిల్లాలు విడిపోయిన కూడా ఇంకా సమసిపోలేదని.. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభ ద్వారా మరోసారి నిరూపితమైంది. ఈ బహిరంగ సభకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు హాజరు కాకపోవడం, ఆయన వర్గానికి చెందిన నేతలంతా మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
వాస్తవానికి పా ర్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఇతర రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొనే సభకు జిల్లా పార్టీలో పెద్దన్న పాత్ర పోషించే మోత్కుపల్లి హాజరు కావాల్సి ఉంది. కానీ, ఉమామాధవరెడ్డి వర్గానికి చెందిన భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తుండడంతో ఆయన మొహం చాటేసినట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బిల్యానాయక్ కూడా బహిరంగ సభలో పాల్గొనకపోవడం విశేషం. ఉదయం నుంచి రేవంత్ వెంట పాదయాత్రలో ఉన్న బిల్యా అకస్మాత్తుగా బహిరంగసభకు రాకుండానే వెళ్లిపోయారు. ఇందుకు తనకు అధ్యక్షస్థానం ఇవ్వకపోవడమే కారణమని తెలుస్తోంది.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీ బహిరంగసభల్లో జిల్లా అధ్యక్షుడికే అధ్యక్ష స్థానం ఇచ్చే అలవాటున్నా... ఈ సభలో మాత్రం కార్యక్రమాన్ని భుజాన మోసిన కంచర్ల భూపాల్‌రెడ్డికి ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన తాను ఉండలేనని చెప్పి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇక, మోత్కుపల్లి రాకపోవడం, బిల్యా అలిగి వెళ్లిపోవడంతో నర్సింహులు వ ర్గీయులంతా మొక్కుబడిగా కూర్చుని వెళ్లిపోయారు. ఆ వర్గానికి చెందిన నేతలు కేవలం వేదిక మీద కూర్చునేందుకే పరిమితం కాగా, ఉమావర్గం నేతలంతా ప్రసంగాలు చేశారు. మొత్తానికి కంచర్ల వన్‌మ్యాన్‌షోలాగా సాగిన ఈ బహిరంగసభ, పాదయాత్ర కార్యక్రమాల్లో టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు జిల్లాకు చెందిన నేతలు జగదీశ్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావు, రవీంద్రకుమార్‌ల మీద దుమ్మెత్తిపోయడం విశేషం.
Advertisement
Advertisement