
మంచి అభ్యర్థిని చూపిస్తే వైదొలుగుతా..
♦ అధికార, విపక్షాలకు వరంగల్
♦ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ సవాల్
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార, విపక్షాలు తనకన్నా మంచి అభ్యర్థిని చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వామపక్షాలు, ఉద్యమ, ప్రజా సంఘాలు బలపర్చిన అభ్యర్థి ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు. రైతు, మహిళా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించాలని అనుకుంటే ప్రతిపక్షాలు కూడా అభ్యర్థులను నిలబెట్టకుండా తనకు సహకరించాలని అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతీ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ను బలపరిచానని, అది ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకే అని అన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక నియంత పాలన, దొరల పాలన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం కుల మతాలకు అతీతంగా ఎలా పోరాడామో వరంగల్ ఎన్నికల్లో అదే పోరాటస్ఫూర్తి కనబర్చి పార్టీలకు సంబంధంలేని స్వతంత్ర అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. 31న వరంగల్‌లో వామపక్షాలు, ప్రజా, ఉద్యమ, విద్యార్థి సంఘాలు నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.