జైలు నుంచి వైఎస్సార్‌సీపీ నేతల విడుదల
నెల్లూరు(క్రైమ్): వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డిలు గురువారం నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ ఈ నెల 17న పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలుకు తరలించడం, వారికి బుధవారం తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు గురువారం సాయంత్రం విడుదలయ్యారు. వారిని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తదితరులు పరామర్శించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న వారికి వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.
అంతకుముందు నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ ఉగ్రవాదాన్ని సృష్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు.
రాజన్న వారసులం.. జగనన్న సైనికులం
నెల్లూరు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం రాత్రి మాట్లాడుతూ తాము మహానేత రాజన్న వారసులం... జగనన్న సైనికులమని, అక్రమ అరెస్ట్‌ల్ని లెక్క చేయబోమని స్పష్టం చేశారు. సీఎం బాబు వినాశకాలే విపరీత బుద్ధి అన్నచందాన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.