విద్యానిధి పరపతిని పెంచాలి
విద్యానిధి పరపతిని పెంచాలి
Published Fri, Jul 7 2017 10:39 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
– రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర
కాకినాడ సిటీ : జిల్లాలో ఏర్పాటైన విద్యానిధి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాల ద్వారా విద్యానిధి పరపతి పెరగాలని ట్రస్ట్ గౌరవ «అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధ్యక్షతన విద్యానిధి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. రవిచంద్ర మాట్లాడుతూ జిల్లాలోని పేద, బడుగు వర్గాలు, నిరాశ్రయులైన కుటుంబాల్లోని పిల్లలకు విద్యనందించేందుకు 2012వ సంవత్సరంలో విద్యానిధి చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సహాయం చేశామన్నారు. ఈ ట్రస్ట్ ఏర్పాటు కోసం ఐ.పోలవరం మండలానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఒక రోజు వేతనం అందించారని తెలియజేస్తూ వారిని అభినందించారు. ట్రస్ట్ æనిధులతో పాటు బ్యాంకులు కూడా రుణ సదుపాయం కల్పిస్తే విద్యానిధి పరపతి పెరుగుతుందన్నారు. కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ ట్రస్ట్‌కు సీఎస్‌ఆర్ నిధులు సమకూర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో 2017–18 సంవత్సరాల్లో ఇంటర్, ఉన్నత విద్యలో చేరే విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా చేపట్టవల్సిన అంశాలను చర్చించారు. ట్రస్ట్ ద్వారా విద్యారుణం అందించడానికి, ట్యూషన్ సెంటర్లు, లైబ్రరీ స్టడీసెంటర్లు నిర్వహణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు తాడి నాగదుర్గా, సెక్రటరీ ఎస్‌ఎం లక్ష్మి, కోశాధికారి ఎం.మేరీ, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం భాస్కరరావు, ఎల్‌డీఎం బీవీ సుబ్రహ్మణ్యం, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎంఎస్ శోభారాణి, బీసీ వెల్ఫేర్ డీడీ ఎం.చినబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement