పాదయాత్రకు మద్దతుకు ముద్రగడ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
దివిలి (పెద్దాపురం) : ఈ నెల 26 నుంచి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న అమరావతి పాదయాత్రకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన బైక్ ర్యాలీ విజయవంతంగా ముగిసింది. రెండు రోజలు కిందట కాకినాడ వరకు ముద్రగడకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహిస్తారన్న ఊహాగానాలు అందుకోవడంతో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆ రోజు బైక్ ర్యాలీ ఉండదని భావించిన పోలీస్ బలగాలు వెనుదిరిగాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కిర్లంపూడి మండలం రాజుపాలెం నుంచి మాజీ మంత్రి ముద్రగడకు మద్దతుగా సుమారు 200 బైక్‌లతో పెద్దాపురం మండలం దివిలి, పులిమేరు, గోరింట మీదుగా పిఠాపురం మండలం మల్లాం, జల్లూరు మీదుగా నియోజకవర్గంలోకి చేరుకుంది. బైక్ ర్యాలీని అనుసరిస్తూ ముద్రగడ పద్మనాభం కారులో పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మీదుగా సింహాద్రిపురం చేరుకుని అక్కడ నుంచి తన నివాసం కిర్లంపూడి వరకు బైక్ ర్యాలీ శాంతియుతంగా నిర్వహించడంతో పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అకస్మాత్తుగా పెద్దాపురం మండలం నుంచి ర్యాలీ కొనసాగడంతో సమాచారం అందుకున్న పోలీసులు సామర్లకోట సీబీఎం సెంటర్ వద్ద అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ గోరింట మీదుగా పిఠాపురానికి ర్యాలీ చేరడంతో పోలీసులు వ్యూహం బెడిసిగొట్టింది.
బైక్‌లతో హల్‌చల్
పిఠాపురం టౌన్ : కాపులకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం బాటపట్టిన ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన బైక్ ర్యాలీ ఆదివారం పట్టణానికి చేరుకుంది. హఠాత్తుగా వచ్చిన ఈ ర్యాలీని చూసి అధికార పార్టీ నేతలతో పాటు, అధికారులు నివ్వెరపోయారు. ముందస్తు సమాచారం లేకుండా ముద్రగడ పట్టణంలో అనుచరులతో బైక్ ర్యాలీ నిర్వహించడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం మండలం మల్లాం మీదుగా నియోజకవర్గం ప్రధాన కేంద్రం పిఠాపురంలోకి చేరిన బైక్ ర్యాలీ గొల్లప్రోలు మీదుగా సాగింది. ముద్రగడ కారులో కూర్చునే ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో ముద్రగడ అనుచరులు, కాపులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముద్రగడపై కేసు నమోదు
పిఠాపురం రూరల్ : చట్టాన్ని అతిక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం మల్లాం మీదుగా పిఠాపురం వరకు మోటర్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై కేసు నమోదు చేసినట్టు పిఠాపురం రూరల్ పోలీసులు తెలిపారు. జిల్లాలో సెక‌్షన్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ఎటువంటి అనుమతి తీసుకోకుండా బైక్ ర్యాలీ చేసిన 13 మంది కాపు నేతలపైనా కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు చెప్పారు.