'సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు'
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి
కామారెడ్డి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ పోరాట స్ఫూర్తి బస్సు యాత్రకు కామారెడ్డిలో సీపీఐ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బైక్‌ర్యాలీ నిర్వహించి, మున్సిపల్ ఎదుట సాయుధ పోరాట యోధుడు ఫనిహారం రంగాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడడ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనను అంతం చేయడానికి 1947 సెప్టెంబర్ 11న ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్దుం మోహినొద్దీన్‌లు సాయుధపోరాటానికి పిలుపునివ్వడంతోప్రజలు తుపాకీ పట్టి నిజాంను గద్దె దింపి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించారన్నారు. ఈ పోరాటం నడుస్తున్న క్రమంలో చాలా మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారని, ఈ ప్రాంతానికి చెందిన ఫణిహారం రంగాచారి పోరాటస్ఫూర్తి మరువలేనిదని పేర్కొన్నారు. ఫణిహారం కాదు ఆయన తెలంగాణకు మనిహారం అని కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం సాయుధ పోరాట చరిత్రకు మతం రంగు పూయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో సాయుధ పోరాటం జరుపుతున్నపుడు బీజేపీ ఎక్కడ ఉన్నదని ప్రశ్నించారు. తిరంగా యాత్ర పేరుతో బీజేపీ యువతను తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
నిజామాబాద్ ఎంపీ కవిత నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినం జరిపి, అధికారంలోకి వచ్చిన తరువాత మరవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా, రాష్ట్ర నాయకులు సృజన, జ్యోతి, రాములు, యాదవ్, వేణు, సీపీఎం రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి, రాములు, సీపీఐ జిల్లా నాయకులు వీఎల్ నర్సింహారెడ్డి, డివిజన్ కార్యదర్శి పసుల బల్‌రాజు, దశరత్, భానుప్రసాద్, రాజశేఖర్, రాంచంద్రం, రవి, నర్సింలు, సుధాకర్‌రెడ్డి, పెంటయ్య, సంపత్, నజీర్, రాజశేఖర‡రెడ్డి, తిరుపతిగౌడ్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.