కాపు సామాజిక వర్గంలో ఉన్న పౌరుషానికి తాళం తీయాల్సిన సమయం వచ్చిందని, రాయలసీమ తరహాలో ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని సీనియర్ రాజకీయ నేత దంగేటి కొండయ్య ఇంట్లో బుధవారం ఆయన కాపు నేతలతో భేటీ అయ్యూరు.
తుని ఐక్య గర్జనతో కాపుల ఐక్యత బహిర్గతమైందని, తర్వాత జరిగిన పరిణామాల వల్ల కాపుల డిమాండ్లు న్యాయమైనవని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు తర్వాత ఉద్యమ కార్యాచరణపై కాపు నాయకులందరితో సమాలోచన చేస్తున్నట్లు వివరించారు. చావో రేవో తేల్చుకునే వరకూ కాపు కులం కోసం పోరాడతానన్నారు.
కాపు నేతలు నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, కల్వకోలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ.. కాపు యువత శాంతియుత మార్గం ఎంచుకుని ఉద్యమంలో పాల్గొనాలని, సమన్వయంతో డిమాండ్లు నెరవేర్చుకోవాలని సూచించారు. కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో చల్లపల్లిలో గుండె పోటుతో మృతి చెందిన గొలకోటి బాపన్నాయుడు కుటుంబాన్ని ముద్రగడ పరామర్శించారు. ఆయన భార్య అమ్మాజీతో మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.