'తూర్పు గోదావరికి బయట వ్యక్తులు రావొద్దు'
కాకినాడ : కాపు ఐక్యగర్జన సభకు అనుమతిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. సభ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాత్రం సీఎం ప్రకటనతో విభేదించారు. కాపు సభకు అనుమతి ఇవ్వలేదని ఆయన వివరణ ఇచ్చారు. అనుమతి లేకుండా సభకు హాజరయ్యారనే 27మంది నేతలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
కాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తన సతీమణితో కలిసి శుక్రవారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్న నేపథ్యంలో రేపటి నుంచి తూర్పు గోదావరి జిల్లాకు బయట వ్యక్తులు రావొద్దని ఎస్పీ సూచించారు. జిల్లాల నుంచి బయట వ్యక్తులు ఎవరైనా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 10వేలమంది పోలీసులు మోహరించారని, 58 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. తుని ఘటన కు సంబంధించి నమోదు చేసిన కేసులపై పారదర్శకంగా దర్యాప్తు జరుగుతోందని, అమాయకులను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయమని ఆయన తెలిపారు.