కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు
కిర్లంపూడి: బీసీ రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెం నుంచి తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’కు బ్రేక్ పడింది. ముద్రగడ పాదయాత్ర యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నేడు ఆయన సత్యాగ్రహ యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో నిన్న(మంగళవారం) నుంచే పోలీసులు ఉద్యమనేత ముద్రగడను కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. ముద్రగడ నివాసం చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. కిర్లంపూడితో పాటు కొనసీమలోనూ భారీగా పోలీసులను మోహరించారు. ముద్రగడతో పాటు మరికొందరు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, సాధనాల శ్రీనివాస్, ఈవై దాసు, నల్లా విష్ణు, కలవ కొలను తాతాజీ, పవన్ తదితరులను పోలీసులు రావులపాలెంలో అరెస్ట్ చేసి కాకినాడ 3వ టౌన్ పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. కాపు నేతలపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో కోనసీమ నివురుగప్పిన నిప్పులా ఉంది.
కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ ఈ నెల 16 (బుధవారం)న రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రావులపాలెం నుంచి పాదయాత్ర అంతర్వేది వరకు ఐదురోజులపాటు నిర్వహించాలని కాపు నేతలు నిర్ణయించగా పోలీసులు ముందుగానే ఉద్యమనేతను యాత్రను భగ్నం చేశారు. మంగళవారం సాయంత్రం ముద్రగడ కిర్లంపూడిలోని స్వగృహం నుంచి కారులో బయలుదేరగా గేటు బయట పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయన్న కారణంతోనే ముద్రగడను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.