ముద్రగడకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం
రాజమండ్రి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో భార్యతో కలిసి ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించి వైద్యానికి సహకరించాలని అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేసినా ఆయన ప్రతిఘటించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు.
కాగా ముద్రగడపై ఆత్మహత్యయత్నం కేసు మాత్రమే నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా కొన్నిచోట్ల ముందస్తు అరెస్ట్లు చేసినట్లు ఆయన శనివారమిక్కడ వెల్లడించారు. ముద్రగడ దీక్ష కొనసాగుతోందని, ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
మరోవైపు కాపు ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసేసి బంద్ పాటిస్తున్నారు. అయితే పోలీసులు దగ్గరుండి బలవంతంగా షాపులు తెరిపిస్తున్నారని కాపు నేతలు మండిపడుతున్నారు. బంద్ విజయవంతం కాకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బైక్‌లపై వెళ్లే యువకులను కూడా పట్టుకుని దౌర్జన్యంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ముద్రగడ దీక్షకు మద్దతుగా కాపు నేతలు రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లలో కాపు నేతలను గృహ నిర్బంధం చేశారు. పాలకొల్లు నియోకవర్గ కాపు అధ్యక్షుడు వంగా నర్సింహారావు, ఏలూరు పట్టణ కాపు అధ్క్షుడు బోనం వెంకట నర్య్య, కాపు కార్యదర్శి జక్కంపూడి కుమార్, జిల్లా కాపు నాయకుడు ముచర్చ శ్రీరామ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. దుకాణాలు, వర్తక వ్యాపారులు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ముద్రగడ దీక్షను అణగదొక్కాలని ప్రయత్నిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.