ముద్రగడ దీక్ష కొనసాగుతుంది: కాపు జేఏసీ
కాపు రిజర్వేషన్ల సాధన కోసం, తుని ఘటనలో అరెస్టయిన వారిని విడిపించాలన్న లక్ష్యతో గత ఏడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తన దీక్షను కొనసాగిస్తారని కాపు జేఏసీ నేతలు తెలిపారు. ఆయన కేవలం తన రక్త నమూనాలు ఇచ్చేందుకు మాత్రమే అంగీకరించారని.. అంతేతప్ప ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు అనుమతించలేదని చెప్పారు.
కాగా, అంతకుముందు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి, ఫ్లూయిడ్స్ ఎక్కించుకోడానికి ముద్రగడ పద్మనాభం అంగీకరించారని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. కాపునేతలతో చర్చలు సఫలం అవుతాయని ఆశిస్తున్నామని, ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. అయితే.. ఎమ్మెల్యే ఆకుల వ్యాఖ్యలను కాపు జేఏసీ నేతలు ఖండించినట్లయింది. ముద్రగడ పద్మనాభం ఫ్లూయిడ్స్ ఎక్కించుకోడానికి అనుమతించలేదని కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు.