ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించాలి
► వాణిజ్య పన్నుల నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్‌హుస్సేన్
కరీమాబాద్ : ప్రభుత్వం ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించాలని వాణిజ్య పన్నుల నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ముజాహిద్‌హుస్సేన్ కోరారు. శనివారం హన్మకొండ అశోక కాన్ఫరెన్స్ హాల్‌లో డివిజన్ అధ్యక్షుడు కె.గోపీకిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముజాహిద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్–2 ఉద్యోగులకు నేరుగా ఏసీటీఓలు గానూ, అలాగే కిందిస్థాయి సిబ్బంది పదోన్నతుల ద్వారా ఏసీటీఓలుగా నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు.
గ్రూప్–2 ద్వారా నియామకమయ్యే సబ్‌రిజిస్ట్రార్లు, డీటీలు, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లు, ఎస్‌టీఓలకు గెజిటెడ్ హోదా ఇచ్చినట్లుగా ఏసీటీఓలకూ అవకాశం ఇవ్వాలని కోరారు. ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి భారం ఏర్పడదని ముజాహిద్ వివరించారు. ఏసీటీఓలు సుమారు 30 నుంచి 35 ఏళ్లుగా విధులు నిర్వర్తించినప్పటికీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లుగానే ఉద్యోగవిరమణ చేయాల్సి వస్తోందన్నారు. సమావేశంలో గోపీకిషోర్, అజయ్‌కుమార్, మసూద్, రమేష్, జగదీష్‌కుమార్, సామ్యూల్, సుమలత, నాగమణి, వినయ్, మమత, అనుకిరణ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.