సాక్షి, హైదరాబాద్: కమర్షియల్ ట్యాక్స్ చలాన్ల కుంభకోణంలో కోర్టులో లొంగిపోయిన ముగ్గురు నిందితులను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బోధన్ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీవో, ఓ సీనియర్, మరో జూనియర్ అసిస్టెంట్ గత వారం కోర్టులో లొంగిపోయారు. వారిని విచారించి కేసుకు సంబంధించి మిగిలిన నిందితుల పాత్రను నిరూపించాల్సి ఉందని, కాబట్టి వారిని కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారం రోజుల పాటు ఆ ముగ్గురిని విచారించేందుకు కోర్టు అనుమతిచ్చిందని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. కేసులో కీలకంగా ఉన్న ప్రైవేట్ ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజు, అతడి కుమారుడు సునీల్ కోసం సీఐడీ బృందాలు వేటసాగిస్తున్నాయి.