![నృసింహాలయంలో ‘ముక్కోటి’ శోభ](/styles/webp/s3/article_images/2017/09/5/71483812598_625x300.jpg.webp?itok=z4TSfUu6)
నృసింహాలయంలో ‘ముక్కోటి’ శోభ
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ‘ముక్కోటి ఏకాదశి’ శోభ సంతరించుకుంది. రెండు రోజులుగా ఆలయంలో ‘ముక్కోటి’ ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి ఆచార్యులు పేర్కొన్నారు. ఈ రోజున వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమన్నారు. వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకొని సుమారు లక్ష మందికి పైగా భక్తులు లక్ష్మీ నారసింహుని వైకుంఠ ద్వారం(ఉత్తర గోపురం) గుండా ఆదివారం దర్శించుకుంటారని ఆలయ, పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో పాటు పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానికులే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులతో హాజరైతే మరింత శుభదాయకమని ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి సూచించారు. భక్తుల కోసం ఆలయంలోనే కాకుండా ఆలయ ప్రాంగణంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.