బహుళ ప్రయోజనకారి వాటర్‌గ్రిడ్
అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా (వాటర్‌గ్రిడ్) ప్రాజెక్ట్‌ను బహుళ ప్రయోజనకారిగా మార్చాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ తో పాటు ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్‌ను కూడా వేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర ్ణయించినట్లు చెప్పారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఫైబర్ కేబులింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. పైప్‌లైన్ల కోసం త్వరలోనే తవ్వకాలు ప్రారంభిస్తున్నందున, ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి సంబంధించిన విధి విధానాలను ఈనెల 9లోగా తయారు చేయాలని నిర్దేశించారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పైప్‌లైన్‌తో పాటు కేబుల్స్ వేయడం ద్వారా 80 శాతం ఖర్చు తగ్గుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీశాఖకు సూచించారు. సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాటర్‌గ్రిడ్‌పై పశ్చిమబెంగాల్ ఆసక్తి: వాటర్‌గ్రిడ్‌పె పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమితాసక్తిని కనబరుస్తోందని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ డిజైన్‌తో పాటు ఫైనాన్షియల్ మోడల్ గురించి వివరించాలని ఆ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌దాస్ తనకు లేఖ రాశారని పేర్కొన్నారు. ఈనెల 4న బెంగాల్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బృందం రాష్ట్రానికి వస్తున్నట్లు చెప్పారన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ వాటర్‌గ్రిడ్ గురించి తెలుసుకోగా, బిహార్ ఎన్నికల ప్రచారంలోనూ ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుపై హామీ ఇచ్చినట్లు తెలిసిందని ఈఎన్‌సీ చెప్పారు.