ప్రొద్దుటూరు టౌన్:మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందే.. అది కూడా రెండు రోజుల్లో అయిపోవాలి. మాకు వరదరాజులరెడ్డి నుంచి ఒత్తిడి ఎక్కువైంది అంటూ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నరసారెడ్డి, జయనాగేశ్వరరెడ్డితోపాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆదివారం మాట్లాడాలంటూ మున్సిపల్ చైర్మన్‌ను పార్టీ పెద్దలు హైదరాబాదుకు పిలిపించారు. ఈ సందర్భంగా వారు చైర్మన్‌తో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు రెండేళ్లు ఒకరు, మూడేళ్లు మరొకరు ఉండాలని ఇది వరకు తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. రెండేళ్ల గడువు ముగిసి మూడునెలలు అయిందని చెప్పారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని తెలిపారు. రెండవ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న ఆసం రఘురామిరెడ్డికి చైర్మన్ సీటు ఇవ్వాలని, ఈనెల జరిగే కౌన్సిల్ సమావేశపు అజెండాలో ఈ అంశం రావాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. రాజీనామా చేస్తే పార్టీలో మరో పదవి ఇస్తామని కూడా ఆశ చూపారు. ఉన్నట్లుండి హైదరాబాదుకు రమ్మని చెప్పి కేవలం 48 గంటల్లో రాజీనామా చేయాలని చెప్పడంపై చైర్మన్‌కు పరిస్థితి అర్థం కాలేదు.
తీవ్ర అసహనంతో బయటికి..
ఈ చర్చ జరుగుతుండగానే చైర్మన్ గురివిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశం నుంచి బయటికి వస్తూ నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని చెప్పి అక్కడి నుంచి చైర్మన్ వెళ్లి పోవడంతో పార్టీ పెద్దలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఎవరి పంతం నెగ్గేనో...
ఎన్నికల సందర్భంగా అదనంగా రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన చైర్మన్‌కు మూడేళ్లు పదవిలో కొనసాగే విధంగా ఆ నాడు ఒప్పుకున్న పార్టీ నాయకులు నేడు వరదరాజులరెడ్డి ఒత్తిడితో ఏం మాట్లాడకపోవడాన్ని చైర్మన్ వర్గీయులు, కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా తాను దిగను అని చైర్మన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇటు చైర్మన్ మాట నెగ్గుతుందా, వరదరాజులరెడ్డి మాట చెల్లుతుందో వేచి చూడాల్సిందే. కాగా చైర్మన్ మూడేళ్లకు ముందు దిగరన్న విషయాన్ని కొందరు కౌన్సిలర్లు స్పష్టం చేస్తున్నారు. పార్టీ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో చట్ట ప్రకారం నాలుగేళ్ల వరకు చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు వీలు లేని అంశాన్ని కూడా చైర్మన్ వర్గీయులు పరిశీలిస్తున్నారు.
లింగారెడ్డి దృష్టికి సమస్య
ఈ విషయాన్ని కొందరు కౌన్సిలర్లు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా చైర్మన్‌ను రెండు రోజుల్లో రాజీనామా చేయాలని చెప్పడాన్ని తప్పుబట్టినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం పొట్లదుర్తిలో ఉన్న ఎంపీ సీఎం రమేష్‌నాయుడుతో లింగారెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా టీడీపీలో మొదలైన అంతర్గత పోరు మరి రెండు రోజుల్లో రోడ్డున పడనుంది.
మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందే
Published Sun, Sep 25 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
Advertisement
Advertisement