
వరదరాజులరెడ్డి బెదిరింపులకు కన్నీరు పెట్టుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ రామలక్షుమ్మ
ప్రొద్దుటూరు : టీడీపీ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ రామలక్షుమ్మను బెదిరించారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వరదరాజులరెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్‌తో పాటు సిబ్బందిని బయటికి రావాలని బెదిరించారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లోపలే ఉండి బయటికి రాలేనని బోరున విలపించారు.
మీకూ ఆడ పిల్లలున్నారు కదా.. అని ఆమె ప్రాధేయపడ్డారు. రాజకీయాలతో తమకేం సంబంధం లేదని తెలిపారు. అయినా వినకుండా వరదరాజులరెడ్డి.. నువ్వు ఏడ్చినా వదిలేదిలేదు.. బయటకు రావాల్సిందే.. అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. విధిలేని పరిస్థితిలో సబ్ రిజిస్ట్రార్ ఏడ్చుకుంటూ బయటకొచ్చారు. మహర్షి స్కూల్ స్థలం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వరద చెప్పినట్టు సబ్ రిజిస్ట్రార్ వినలేదు.
నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో సబ్ రిజిస్ట్రార్ దానిని రిజిస్టర్ చేయకపోవడంపై వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి కప్పం కట్టాలా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాదాపు అరగంట పాటు విధులకు ఆటంకం జరిగి లావాదేవీలు నిలిచిపోయాయి.
ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని బెదిరించి విధులకు ఆటంకం కలిగించడమేంటని అక్కడివారు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment