సాక్షి, అమరావతి : ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, గుంటూరు జిల్లా పొన్నూరు.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపురంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మిదేవిని టీడీపీ సీనియర్ నేతలు మల్లికార్జున, ఉన్నం మారుతీచౌదరి, అనిల్ చౌదరి, పవన్ చౌదరి బెదిరించారు.
కొండాపురం ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. కొండాపురంలో బలవంతపు ఏకగ్రీవాన్ని ఎస్‌ఈసీ రద్దు చేయాలి. 45 ఏళ్లుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కామనూరులో బలవంతపు ఏకగ్రీవాలతో ఎన్నికలు జరగకుండా చేస్తున్నారు. బీసీ రిజర్వ్‌డ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ కరీమూన్‌ను వరదరాజులరెడ్డి బెదిరిస్తున్నారు. షేక్ కరీమూన్‌కు రక్షణ కల్పించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. వరదరాజులరెడ్డిని అరెస్ట్ చేయాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment