అలరించిన ‘యాదే రఫీ’ సంగీత విభావరి
నెల్లూరు(దర్గామిట్ట): మినీబైపాస్‌రోడ్డులోని అనిల్ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి మహ్మద్ రఫీ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యాదే రఫీ' సంగీత విభావరి అలరించింది. అకాడమీ అధ్యక్షుడు జాకీర్‌హుస్సేన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన గాయకులు మధురగీతాలతో సమ్మోహితులను చేశారు. మహ్మద్ రఫీ 36వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మ్యూజికల్ నైట్‌లో మహ్మద్ రఫీ సుమధుర గీతాలు ఆద్యంతం శ్రోతలను ఆనందపారవశ్యంలో ముంచెత్తాయి. గాయకులు ఎహ్‌తెషామ్, సిమ్రన్, గౌస్‌బాషా, సుజాత, శిరీష, తొలిసారి నెల్లూరుకి విచ్చేసిన ఇండియన్ ఐడల్ సింగర్స్ సుప్రీంశేఖర్, నాగజ్యోతి, తదితరులు ఆలపించిన పాటలు ఓలలాడించాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. జాదూగర్ శ్రీనివాస్‌తో ప్రదర్శితమైన ఇంద్రజాల ప్రదర్శన సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. విశేషంగా హాజరైన ప్రేక్షకులతో అనిల్‌గార్డెన్స్ నిండిపోయింది. మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.