సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్
- వందశాతం అమలుకు బల్దియా చర్యలు
- కవర్లు వాడితే భారీగా జరిమానాలు
మెదక్: క్యాన్సర్ వ్యాధికి కారణమవుతూ పర్యావరణానికి పెనుముప్పుగా మారిన తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని పకడ్బంధీగా అమలు చేసేందుకు మెదక్ బల్దియా సన్నద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి పట్టణంలో వందశాతం తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
40 మైక్రాన్లలోపు ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం పర్యావరణానికే కాకుండా మానవాళి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. దీంతో తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లను వినియోగించడంపై ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించింది. అయితే అంతటా నిర్లక్ష్యం అలుముకోవడంతో వాటి నిషేధం పూర్తి స్థాయిలో అమలు కాలేదు.
దీంతో తక్కువ మైక్లాన్ల కవర్ల వాడకాన్ని పకడ్బంధీగా నిలువరించేందుకు బల్దియా నడుం బిగించింది. ఈ నేపథ్యంలో నిషేధం అమలులో ఉన్నా అక్రమంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న షాపుల యజమానులపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం కోసం బల్దియాలు కృషి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 18న మెదక్ ఖిల్లా బల్దియా అధికారులతోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్, వైస్‌చైర్మన్‌లతో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ కవర్లను వందశాతం నిషేధించి, ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని నెలకొల్పాలని తీర్మానం చేశారు.
మున్సిపల్ శానిటేషన్ అధికారులు ప్లాస్టిక్ కవర్లను వినియోగించే షాపుల యజమానులపై భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తూ వందశాతం నిషేధం అమలుకు కృషి చేస్తున్నారు. అలాగే రోడ్లపై షాపుల యజమానులు నిత్యం చెత్తా చెదారం పడేయడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ప్రతీ షాపు యజమాని చెత్తను బుట్టలోనే వేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు.
ఇందుకోసం పట్టణంలోని డిపో రోడ్డు, జే.ఎన్ రోడ్డుతోపాటు మున్సిపాలిటీ ముందున్న రోడ్లను ఎంపిక చేశారు. మున్సిపాలిటీ ఆదేశాలు పాటించని షాపులపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ బ్యాగుల వాడకానికి బదులు న్యూస్ పేపర్‌తో తయారు చేసే బ్యాగులను ఉపయోగించాలని నిర్ణయించారు.
ఈ బ్యాగుల తయారీ కోసం ఇప్పటికే మెప్మా అధికారులు సంగారెడ్డికి వెళ్లి దాని తయారీని క్షుణ్ణంగా తెలుసుకొని వచ్చినట్లు తెలిసింది. కాగా పట్టణంలోని మహిళా గ్రూప్ సభ్యులకు పేపర్ బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చి వాటిని తయారు చేయించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
బ్యాగుల తయారీతో మహిళా సంఘాల సభ్యులకు జీవనోపాధి లభించడంతోపాటు పట్టణంలో వందశాతం ప్లాస్టిక్ నిషేధం అమలవుతుందని అధికారులు భావిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఈ పేపర్ బ్యాగులను అన్ని షాపుల యజమానులు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రజలు సహకరించాలి
ప్లాస్టిక్ రహిత పట్టణం కోసం ప్రజలంతా సహకరించాలి. ప్లాస్టిక్‌తో క్యాన్సర్ వ్యాధితోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతిని కరువు, కాటకాలకు కారణమవుతోంది. ప్లాస్టిక్‌తో ఇంతటి ప్రమాదం పొంచి ఉన్నందున దీని వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. దీనికి ప్రజలంతా సహకరించాలి. - మల్లికార్జున్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్, మెదక్
ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలే
మానవ మనుగడకు పెనుముప్పుగా తయారైన ప్లాస్టిక్‌ను మెదక్ పట్టణంలో పూర్తిగా నిషేధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్లాస్టిక్ వాడినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పట్టణంలో షాపులు, హోటళ్లపై దాడులుచేసి జరిమానాలు విధించాం. అక్టోబర్ 2వరకు వందశాతం నిషేధం అమలు చేస్తాం. - షాదుల్లా, శానిటేషన్ అధికారి, మెదక్
పేపర్ బ్యాగుల తయారీలో మహిళలు ముందుండాలి
పట్టణంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నందున పేపర్ బ్యాగుల తయారీ విధానం తెలుసుకునేందుకు మెప్మా అధికారులను ఇప్పటికే సంప్రదించాం. త్వరలోనే మహిళా సంఘాల సభ్యులకు వాటి తయారీపై శిక్షణ ఇప్పిస్తాం. పేపర్ బ్యాగుల తయారీతో ఆదాయం సమకూరుతుంది. దీనికోసం మహిళలకు రుణాలిస్తాం. - ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్, మెదక్