జూలై 31 లోపు పూర్తి చేయాలి
► ప్రాజెక్టుల పనులు వేగిరం చేయాలి
► జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు
► సాగునీరు అందించడమే లక్ష్యం
► పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేసి 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మహాత్మాగాంధీ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌పె సమీక్షానిర్వహించారు. లిఫ్ట్‌లు పూర్తి చేసి మోటార్లు బిగించి ట్రయల్ రన్ చేయాలన్నారు. చివరి ఆయకట్టు పొలాల వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ సమస్య లేకుండా పూర్తి చేయాలన్నారు. రైతులకు పరిహారం అందించడంలో జాప్యం చేయరాదన్నారు. రోడ్ కటింగ్ అవసరమున్న ప్రాంతాల్లో ఆర్‌ఆండ్‌బి, పీఆర్ అధికారులతో సమన్వయం చేసుకొని పనులు పూర్తి చేయాలని అన్నారు.
సమస్య వచ్చిన ప్రాంతాలకు సంబంధింత ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లి సమస్య పరిష్కరించి పనులు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు. ఎంజీఎల్‌ఐలో 28వ ప్యాకేజీలో మొత్తం ఆయకట్టు 57 వేల ఎకరాలకు గాను 13 వేల ఎకరాలకు సంబందించి ఫీల్డ్ చానెల్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెంట్లవెల్లి, చౌటబట్ల గ్రామాల్లో రైతులను ఒప్పించి ఫీల్డ్ చానెల్ పనులు పూర్తి చేయాలన్నారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో చేపడుతున్న ప్యాకేజీల వారీగా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.
ఈ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్, సీఈ ఖగేందర్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వనజాదేవి, ఎస్‌ఈలు, ఈఈలు, ఆర్‌డీఓలు, వివిధ ప్యాకేజీల్లో పనులు నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.