చీకట్లో మాయం..శవమై ప్రత్యక్షం
చీకట్లో మాయం..శవమై ప్రత్యక్షం
Published Wed, Apr 19 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
యువతి అనుమానాస్పద మృతి
అరటి చెట్టుకు ఉరి
హత్యే అంటున్న తండ్రి
రాజోలు : పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన దిగుమర్తి దివ్య (17) మండలంలోని ములికిపల్లిలో అరటి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందింది. అరవ నారాయణస్వామి కొబ్బరితోటలోని అరటి చెట్టుకు వేలాడుతున్న దివ్య మృతదేహాన్ని ఇన్‌ఛార్జి ఎస్సై వెంకటేశ్వరరావు పరిశీలించి అనుమానస్పద మృతిగా కేసుగా నమోదు చేసినట్టు వెల్లడించారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం ఈ నెల 16న దివ్య ములికిపల్లిలోని అమ్మమ్మ నూకాలమ్మను చూసేందుకు తల్లిదండ్రులు సత్యనారాయణ, మంగ, చెల్లి జ్యోతి కుమారితో కలసి వచ్చింది. అయితే 17వ తేదీ రాత్రి తండ్రి సత్యనారాయణ సెల్‌ఫోన్ తీసుకుని బయటకు వెళ్తానని చెప్పి చెల్లెలు జ్యోతికుమారితో వెళ్లింది. అదే సమయంలో కరెంటు పోవడంతో అక్క కనపించకపోవడంతో జ్యోతికుమారి కంగారుగా వచ్చి తండ్రికి చెప్పింది. స్థానికులతో కలిసి తండ్రి ఎంత వెదికినా ఆమె కనిపించలేదు. దీంతో అంబాజీపేటకు చెందిన పెయింటింగ్ వర్క్స్ చేసుకునే చెవిటి, మూగ అయిన ప్రసాద్‌పై తండ్రికి అనుమానం వచ్చింది. దివ్యను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ప్రసాద్ పెద్దలతో వచ్చి ఆమె కుటుంబ సభ్యులను అడిగాడు. దివ్యను ఉన్నత చదువులు చదివిస్తామని, అప్పుడే పెళ్లి చేయమని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రసాద్‌పై ఆమె తండ్రి పి.గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు మృతదేహాం వద్ద లభించిన దివ్య చెప్పులు, దుస్తులను పరీక్షించి కొన్ని ఆధారాలు సేకరించారు. తండ్రి సెల్‌ఫోన్‌తో ఫోన్లు మెసెజ్‌లు ఏమైనా చేసిందాని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ముమ్మాటికీ హత్యే : తండ్రి సత్యనారాయణ
కూతురు దివ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి సత్యనారాయణ రోదిస్తున్నాడు. ఇంటర్ ఫస్టు ఇయర్‌లో ఆమె మంచి మార్కులు వచ్చాయని విలపించాడు. అరటి చెట్టుకు ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారని ఆరోపించారు. దివ్య కాళ్లు భూమి మీదకు ఉన్నాయని, దివ్యను హత్య చేసి అరటి చెట్టుకు వేలాడదీశారని కుటుంబీకులు ఆరోపించారు. దివ్యను హత్య చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement