వీడని మిస్టరీ!!
∙ రెండేళ్లుగా కనిపించని పార్వతమ్మ
∙ ఆచూకీ లేక వేదనతో తనువు చాలించిన భర్త...తండ్రి
∙ పోలీసులకు పలుమార్లు విన్నవించినా ఫలితం శూన్యం
∙ అసలు ఉందా...లేక మృతి చెందిందా అన్నది తెలియని వైనం
∙ కలెక్టర్, ఎస్పీ స్పందిస్తేనే... పార్వతమ్మ జాడ తెలిసే అవకాశం
కడప: కుటుంబ కష్టాలు తీరుస్తానని.. ఇంటికి ఆసరాగా నిలుస్తానని చెప్పి కువైట్‌కు వెళ్లిన పార్వతమ్మ ఆచూకీ లభించక రెండేళ్లు గడిచింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. తిరగని చోటు లేదు. అసలు పార్వతమ్మ ఉందా? లేక సేట్‌లు ఏమైనా చేశారా అంటూ ఆమె కుటుంబ సభ్యులు మనోవేదనతో తల్లడిల్లిపోతున్నారు. ఇటీవల పార్వతమ్మ పిల్లలు నలుగురితోపాటు వారి నానమ్మ రామసుబ్బమ్మ కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు.
పార్వతమ్మ....ఎక్కడున్నావమ్మా....!
గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మ రెండేళ్ల క్రితం కుటుంబ పోషణ నిమిత్తం కువైట్‌కు వెళ్లింది. అప్పటినుంచి ఇప్పటివరకు జాడ లేకపోవడంతో ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. పార్వతమ్మకు నలుగురు పిల్లలు. అందులో వనజ (10), రెడ్డి నాగశంకర్‌నాయుడు (9), శైలజ (6), సునీల్‌కుమార్‌నాయుడు (3)లు అందరూ చిన్న పిల్లలే. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరి ఆలన, పాలన నానమ్మ రామసుబ్బమ్మ చూస్తోంది.
పార్వతమ్మ కనిపించలేదని వేదనతో ఇద్దరు మృతి
పార్వతమ్మ ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఆచూకీ లేదు. ఆమె ఏమైందో తెలియక తీవ్ర వేదనకు గురైన పార్వతమ్మ భర్త నాగేంద్ర రెండునెలల క్రితం మృత్యువాతపడ్డాడు. 15 రోజుల క్రితం రాయచోటి మండలం మాధవరం పంచాయతీలోని పాలెవారిపల్లెకు చెందిన పార్వతమ్మ తండ్రి తాతినాయుడు కూడా మృతి చెందారు.
సరైన సమాచారం ఇవ్వని ఏజెంట్
పార్వతమ్మ ఆచూకీ కోసం కుటుంబం తల్లడిల్లిపోతున్నా ఆమెను కువైట్‌కు పంపిన ఏజెంటు మాత్రం నోరు విప్ప డం లేదు. రామసుబ్బమ్మ పలుమార్లు వెళ్లి ఏజెంటును కలిసి ప్రశ్నించినా ఏమో తెలియదు.. పంపించాము మా పని అయిపోయిందన్నట్లు చెబుతున్నారని వారు వాపోతున్నారు.
కలెక్టర్, ఎస్పీ స్పందిస్తేనే...
పార్వతమ్మ ఇంటి నుంచి వెళ్లి రెండేళ్లు దాటుతున్న నేపథ్యంలో ఒక కుటుంబం పడుతున్న వేదనను గుర్తించి కలెక్టర్ బాబూరావునాయుడు. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణలు స్పందిస్తేనే ఏదైనా సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రామసుబ్బమ్మతోపాటు పిల్లలు వచ్చి కలెక్టర్‌ను కలిసి వెళ్లారు. స్థానికంగా ఉన్న పోలీసుస్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందిస్తేనే న్యాయం జరగుతుందని రామసుబ్బమ్మ కుటుంబం ఆశతో ఎదురు చూస్తోంది.