సీఐ పార్వతమ్మ
సాక్షి, బెంగళూరు: అతనో కరుడుకట్టిన నేరగాడు, హత్య, హత్యాయత్నం కేసుల్లో నిందితుడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఈ క్రమంలో నిందితుడు బెంగళూరులో ఉంటున్నట్లు సమాచారం అందుకున్న తుమకూరు సీఐ పద్మావతి రంగంలోకి దిగారు. బెంగళూరు పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాలు... హత్య, హత్యాయత్నం తదితర 14 కేసుల్లో నిందితుడైన తుమకూరుకు చెందిన రౌడీషీటర్ స్టీఫెన్ ఫెర్నాండిస్ అలియాస్ గూండా బెంగళూరు బాగలకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లసంద్ర, సోలదేవనహళ్లిలో తలదాచుకున్నట్లు తెలిసింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రౌడీ స్టీఫెన్
దీంతో తుమకూరు తిలక్ పార్కు సీఐ పార్వతమ్మ తన సిబ్బందితో కలిసి బెంగళూరులోని బాగలకుంట సీఐ శివస్వామితో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులతో కలిసి శుక్రవారం పొద్దుపోయాక మల్లసంద్రకు చేరుకున్నారు. నిందితుడు ఉన్న ప్రాంతానికి వచ్చారు. పోలీసుల రాకను గుర్తించిన స్టీఫెన్ పరారవుతుండగా కానిస్టేబుల్ శ్రీనివాస్ పట్టుకోవడానికి యత్నించాడు. దీంతో స్టీఫెన్ కానిస్టేబుల్‌పై మారణాయుధాలతో దాడికి దిగాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్
అక్కడే ఉన్న సీఐ పార్వతమ్మ హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో ఆత్మరక్షణార్థం అతని కాలిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు కుప్పకూలిపోయాడు. హుటాహుటిన పోలీసులు నిందితుడిని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 2017లో తుమకూరుకు చెందిన మంజ హత్యకేసులో స్టీఫెన్ ప్రధాన నిందితుడు. అనేకసార్లు జైలుకు వెళ్లివచ్చాడు. పలు కేసుల్లో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతూ పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. బెంగళూరులోనే కొందరు రౌడీలతో కలిసి ఉంటున్నాడు. అతని అరెస్ట్‌తో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment