
సాక్షి, హైదరాబాద్ : ఓ పిల్లాడు స్కూల్‌కు వెళ్లకపోవడంతో ఆ తల్లి ఏం చేయాలో తోచలేదు. ఎలాగైనా తన కొడుకు స్కూల్‌కు వెళ్లి చదువుకుని ప్రయోజకుడు కావాలనుకుంది. హెచ్చరించింది.. బుజ్జగించింది.. నానా రకాలుగా ప్రయత్నించింది. అయినా ఆ పిల్లాడు వినలేదు. దీంతో ఆ తల్లి పోలీసులకు ఫోన్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. యదాద్రి భువనగిరికి చెందిన మంజుల భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో కొడుకు లోకేశ్‌ను ఎలాగైనా ప్రయోజకుడిగా మార్చాలని కష్టపడి చదివిస్తోంది. అయితే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న లోకేశ్ వారం రోజుల క్రితం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. తాను తిరిగి స్కూల్‌కు వెళ్లనని చెప్పాడు. తల్లి ఎంత బతిమాలినా లోకేశ్ వినలేదు. దీంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు కూడా ఆ పిల్లాడికి నచ్చజెప్పారు. అయినా వినకపోవడంతో లోకేశ్‌ను, అతని తల్లికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కాగా, తెలంగాణలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి.
Comments
Please login to add a commentAdd a comment