కవాడిగూడ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయి.. అసలు ప్రతిపక్షమేదో తెలియడం లేదు.. పత్రికలు సైతం సర్కారంటే జంకుతున్నాయి.. అని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బచావో తెలంగాణ మిషన్ కార్యాలయాన్ని తన అనుచరులతో కలసి బుధవారం బషీర్‌బాగ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ.. అవగాహన రాహిత్యంతో పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొట్టి ప్రజల పక్షాన నిలవడంలో ప్రతిపక్షాలు విఫలమవడంతోనే బచావో తెలంగాణ మిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
త్వరలోనే గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేస్తామన్నారు. రాజకీయాలకతీతంగా పని చేయనున్నామని తెలిపారు. సచివాలయం, ఛాతీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రులను తరలిస్తాం, కూల్చేస్తాం అనే విధ్వంసకర మాటలు కేసీఆర్ వాడుతున్నా ప్రతిపక్ష నాయకులు ఏ ఒక్కరూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. ఆకాశహర్మ్యాల నిర్మాణం వంటి కల్లబొల్లి కబుర్లకే సీఎం కేసీఆర్ పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. అధికారమంతా ఆయన కుమారుడు, అల్లుడు చేతుల్లోనే ఉందనీ, మిగతా మంత్రులంతా డమ్మీలుగా ఉన్నారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్, రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి, బచావో తెలంగాణ మిషన్ నాయకులు వెదిరే యోగీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రతిపక్షాలను సీఎం భయపెడుతున్నారు
Published Wed, Aug 19 2015 4:08 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM
Advertisement
Advertisement