ఒకేసారి రుణమాఫీ చేయాలి
బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు నాగం
హైదరాబాద్: రైతుల రుణాలను ఒకేమారు మాఫీ చేసి ఆత్మహత్యలను ఆపాలని, కరువు మండలాలను ప్రకటించాలని బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు భాదిత రైతు కుటుంబాలకు 3 వేల రూపాయల కరువు భత్యం చెల్లించాలని, ఇప్పటికే పూర్తి కావస్తున్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతను ఆదుకోవాలని బచావో తెలంగాణ మిషన్ తీర్మానించింది. రైతుల సమస్యలపై మిషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆదివారం మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కిసాన్ బచావో దీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో జరిగిన చర్చకు మూడు గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులకు భరోసా ఇచ్చేవిధంగా ప్రకటన చేయకపోవడం శోచనీయమని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలే బంగారు తెలంగాణనా? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకొనే కేసీఆర్ రైతుల రుణాల మాఫీకి రూ. 17 వేల కోట్లు చెల్లించలేరా అంటూ నిలదీశారు. ఉభయ సభల్లో సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం సమావేశంలో పాల్గొనాలని కోరడానికి గవర్నర్‌కు నాలుగు గంటల సమయం కేటాయించిన సీఎంకు.. రైతుల కోసం గంట సమయం దొరకడం లేదని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల కంటే పెద్ద సమస్య ఉందా అని ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా రైతుల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ప్రభుత్వం బురద చల్లుతుందని అన్నారు. ఏకకాలంలో రైతు రుణాలను మాఫీ చేయాలన్నారు. మాజీమంత్రి డీకే అరుణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయేనాటికి రూ. 16 వేల 500 కోట్ల మిగులు బడ్జెట్ ఉందని, ధనిక రాష్ట్రంలో రైతులకు సంబంధించిన రూ. 17 వేల 500 కోట్ల రుణాలను మాఫీ చేయలేకపోతున్నారని అన్నారు.
ఫాంహౌజ్‌లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ విధమైన వ్యవసాయంపై రైతుకు అవగాహన కల్పిం చడం, కనీసం చనిపోయిన రైతుల కుటుంబాలను పలకరించిన పాపాన పోవడం లేదన్నారు. కార్యక్రమంలో సాక్షి ఈడీ రామచంద్రమూర్తి, టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరకు సుధాకర్, నాయకులు రమేష్‌రెడ్డి, చెంగారెడ్డి, జంగారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.