ఆ మంత్రులంతా డమ్మీలే: నాగం
హైదరాబాద్ : తెలంగాణను కాపాడాలనేదే నా సంకల్పమని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అందరం ఒక్కటై రాష్ట్రాన్ని కాపాడుకుందామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లో బచావో తెలంగాణ మిషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీప్ లిక్కర్ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని భవనాలు కూల్చివేస్తానంటున్న మీరు రైతుల ఆత్మహత్యలు పట్టించుకోరా అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య, కరువు, ఆత్మహత్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఓ విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బచావో తెలంగాణ మిషన్ పోరాటం చేస్తుందని నాగం స్పష్టం చేశారు.
ప్రజాధనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకోవడం తప్పుకాదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులంతా డమ్మీలయ్యారని నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు.